Share News

Instagram Model: పేరుకేమో మోడల్.. చేసేది మాత్రం పాడుపని.. ఫాలోవర్లను కూడా..

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:58 PM

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలాగా.. కొందరు మనుషుల్లో రెండు కోణాలు ఉంటాయి. పైన మంచిగా నటిస్తారు కానీ, లోపలన్నీ పాడుబుద్ధులే ఉంటాయి. తమ మాటలతో మాయ చేసి..

Instagram Model: పేరుకేమో మోడల్.. చేసేది మాత్రం పాడుపని.. ఫాలోవర్లను కూడా..
Instagram Model

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలాగా.. కొందరు మనుషుల్లో రెండు కోణాలు ఉంటాయి. పైన మంచిగా నటిస్తారు కానీ, లోపలన్నీ పాడుబుద్ధులే ఉంటాయి. తమ మాటలతో మాయ చేసి.. స్వార్థం కోసం ఇతరుల్ని బలి చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో మనం చెప్పుకోబోయే ఓ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ (Instagram Model) స్టోరీ కూడా దాదాపు అలాంటిదే. జీరో నుంచి మోడల్ స్థాయికి.. సాధారణ వీధుల నుంచి హాలీవుడ్ తారలతో పార్టీలు చేసుకునే రేంజ్‌కి ఎదిగిన ఆ మోడల్.. తన ఫాలోవర్లను వ్యభిచారం కూపంలోకి దింపింది. అంతేకాదు.. తనకు ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయని.. వాటి ద్వారా తాను డబ్బు, ప్రేమ వంటి ఎన్నో సమస్యలను పరిష్కరించగలనని మోసాలకు పాల్పడింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.


ఆ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ పేరు కాట్ టోర్రెస్ (Kat Torres). ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. స్వయంకృషితో ఉన్నత స్థానాలకు చేరింది. ఏకంగా హాలీవుడ్ స్టార్లతో కలిసి పార్టీలు చేసుకునే రేంజ్‌కి ఎదిగింది. హాలీవుడ్ స్టార్ నటుడు లియోనార్డో డీకాప్రియోతో (Leonardo Dicaprio) ప్రేమాయణం నడిపిందన్న రూమర్లు కూడా గతంలో వచ్చాయి. జీరో టు మోడల్ స్థాయికి ఆమె ఎదిగిన విధానానికి.. ఎందరో ఆకర్షితులయ్యారు. ఆమెను తమ ఆదర్శంగా భావించారు. కానీ.. తనకు వచ్చిన ఈ క్రేజ్‌ని తానే స్వయంగా నాశనం చేసుకుంది. సన్మార్గంలో నడవకుండా, పాడు పనులు చేసి తన ఇమేజ్‌ని దెబ్బతీసుకుంది. హ్యామన్ ట్రాఫికింగ్‌కు పాల్పడి.. ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. 2022లో ఆమెతో నివసిస్తున్న ఇద్దరు మహిళలు అదృశ్యం అయ్యాకే.. టోర్రెస్ అసలు రూపం బట్టబయలైంది.


టోర్రెస్ వలలో చిక్కుకొని బయటపడిన మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె చేతిలో తామూ హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యామని, ఆమెకు బానిసలుగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎదిగిన తీరుకి తాము ఆకర్షితులయ్యామని.. కానీ ఆమెకి దగ్గరయ్యాక అసలు నిజాలు తెలిసి షాక్‌కి గురయ్యామని పేర్కొన్నారు. గతంలో న్యూయార్క్‌లో టోర్రెస్‌తో ఒకే రూమ్‌లో కలిసి ఉన్నప్పుడు.. తనని ఆమె డ్రగ్స్‌కు బానిసను చేసిందని మాజీ ఫ్లాట్‌మేట్ వాపోయింది. అలాగే.. టోర్రెస్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి వెళ్లిన ఆనా అనే మహిళ సైతం భయంకర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. తనతో పని చేయించుకొని, ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదని భావోద్వేగానికి లోనయ్యింది. ఆనా ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది కానీ, ఆ తర్వాత మరో ఇద్దరు ఆమె వలలో చిక్కారు.


లిటీసియా, డిసైర్ అనే ఇద్దరు మహిళలు టోర్రెస్‌తో కలిసి ఉండేందుకు టెక్సాస్ వెళ్లారు. అయితే.. కొన్ని వారాల్లోనే డిసైర్‌ను బలవంతంగా ఒప్పించి, వ్యభిచారంలోకి దింపింది. ఒకవేళ తాను నిర్దేశించిన టార్గెట్‌కు రీచ్ అవ్వకపోతే.. తనని ఇంట్లోకి రానిచ్చేది కాదని, బయటే పడుకోవాల్సి వచ్చేదని ఆమె తెలిపింది. చివరికి.. ఆ ఇద్దరు మహిళల కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, వారిని టోర్రెస్ నుంచి విడిపించారు. ఇలా 20 మంది మహిళలు టోర్రెస్ మాయలో పడి మోసపోయామని, తమతో పాడుపనులు చేయించిందని పోలీసులను ఆశ్రయించారు. వాళ్లు ఇప్పటికీ ఆ కాళరాత్రుల నుంచి కోలుకోవడానికి మానసిక చికిత్స పొందుతున్నారు. ఇన్ని పాపాలు చేసింది కాబట్టే.. ఇప్పుడు టోర్రెస్ జైల్లో ఊచలు లెక్కబెడుతోంది.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 06:16 PM