FBI : ఎఫ్‌బీఐ చీఫ్‌గా కశ్యప్
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:03 AM
అమెరికాలో ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)’.. అంటే మన దేశంలో సీబీఐ లెక్క!
అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధిపతిగా భారతీయ మూలాలున్న కాష్ పటేల్ నియామకం!
ఆయనో తెలివైన న్యాయవాది: ట్రంప్
ఎఫ్‌బీఐ చీఫ్ నియామకానికి సెనెట్ ఆమోదం తప్పనిసరి
న్యూయార్క్, డిసెంబరు 1: అమెరికాలో ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)’.. అంటే మన దేశంలో సీబీఐ లెక్క! అంతటి కీలకమైన విభాగానికి అధిపతిగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (44)ను నియమించనున్నట్లు ప్రెసిడెంట్ ఎలెక్ట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్యప్ పటేల్ అమెరికాలో కాష్ పటేల్‌గా సుప్రసిద్ధుడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు తదుపరి డైరెక్టర్‌గా కశ్యప్.. కాష్ పటేల్.. సేవలందిస్తారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. ‘‘కాష్ సూక్ష్మబుద్ధిగల న్యాయవాది, పరిశోధకుడు. అవినీతి గుట్టు రట్టు చేయడానికి, న్యాయాన్ని కాపాడడానికి, అమెరికా ప్రజల పరిరక్షణకే ఆయన కెరీర్ అంతా పాటుపడ్డారు’’ అని ట్రంప్ కొనియాడారు. ‘‘నా తొలి దఫా పాలనలో కాష్ రక్షణ శాఖలో చీఫ్ ఆఫ్ స్టాప్‌గా, నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా, జాతీయ భద్రత మండలిలోని ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా అద్భుతంగా పనిచేశారు. ఎఫ్‌బీఐకి గతంలో ఉన్న విశ్వసనీయతను, ధైర్యాన్ని, నైతిక నిష్ఠను కాష్ పటేల్ తిరిగి తీసుకొస్తారు’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికా పాలనా యంత్రాంగంలోనూ, నిఘా, దర్యాప్తు సంస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు అవసరమనే భావనలో ఉన్న ట్రంప్.. తనకు వీరవిధేయుడిగా పేరున్న కశ్యప్ పటేల్‌ను ఈ పదవికి ఎంచుకోవడం విశేషం. ఈ ప్రకటన నేపథ్యంలో.. ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే, ఎఫ్‌బీఐ ప్రస్తుత డైరెక్టర్ క్రిస్టఫర్ రే తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. నిజానికి 2017లో ఆయన్ను నియమించింది ట్రంపే. కానీ, ఎన్నికల్లో ఓడిపోయాక ఎఫ్‌బీఐ అధికారులు తన కార్యాలయాలపై దాడులు చేయడంతో.. ట్రంప్ ఆ సంస్థపై ద్వేషం పెంచుకున్నారు. కాగా.. కాష్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంది.
గుజరాతీ మూలాలు
కాష్ పటేల్ తల్లిదండ్రులు తొలుత ఉగాండాలో ఉండేవారు. అక్కడ ఈడీ అమీన్ పాలనలో ప్రబలిన అరాచకాలను భరించలేక వారు 1970ల్లో అక్కణ్నుంచీ పారిపోయి అమెరికాలోని లాంగ్ ఐలండ్‌లో స్థిరపడ్డారు. కాష్ పటేల్ 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. 2005లో పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి ‘జ్యూరిస్ డాక్టర్ (టీచర్ ఆఫ్ లా)’ పట్టా పొందారు. అనంతరం ఫ్లోరిడాలో ఎనిమిదేళ్లపాటు పబ్లిక్ డిఫెండర్‌గా.. ఆ తర్వాత ఫెడరల్ పబ్లిక్ డిఫెండర్‌గా విధులు నిర్వర్తించారు. పబ్లిక్ డిఫెండర్‌గా ఆయన అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, మారణాయుధాలకు సంబంధించిన నేరాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు వాదించారు. 2014లో.. అమెరికా న్యాయశాఖ జాతీయ భద్రత విభాగంలో ట్రయల్ అటార్నీగా చేరారు. ఆ సమయంలోనే.. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు సేవలందించారు. 2017లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో స్టాఫర్‌గా పనిచేస్తున్నప్పుడు ట్రంప్ దృష్టిలో పడి ఆయన బృందంలో చేరారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు వీలుగా రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై జరిపిన దర్యాప్తును రిపబ్లికన్ల తరఫున వ్యతిరేకించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రంప్‌పై బైడెన్ సర్కారు తీరును నిరసిస్తూ ‘గవర్న్‌మెంట్ గ్యాంగ్‌స్టర్స్’ అనే పుస్తకాన్ని, ట్రంప్‌ను సింహంగా చిత్రీకరిస్తూ ‘ద ప్లాట్ ఎగైనెస్ట్ ద కింగ్’ అనే పుస్తకాన్ని రాశారు. ట్రంప్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనతోనే ఉన్నారు.
చివరాఖరు: అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రతిష్ఠ కార్యక్రమ సమయంలో అమెరికన్ మీడియా అంతా భారతదేశంలో హిందూ జాతీయవాదం పెరిగిపోతోందంటూ వార్తాకథనాలు రాస్తే కాష్ వాటిని తీవ్రంగా ఖండించారు. గుజరాతీ మూలాలున్న కాష్.. మోదీ అభిమాని. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ మనదేశానికి వచ్చినప్పుడు.. అహ్మదాబాద్‌లో ఆయన ప్రసంగంలో సచిన్, వివేకానందుడు వంటి పేర్లు వచ్చేలా చేయడంలో కీలకపాత్ర పోషించింది కాష్ పటేలే.