Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరాలు.. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు
ABN , Publish Date - Jun 13 , 2024 | 10:36 AM
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) భారతీయుల మృతదేహాలు గుర్తుపట్ట రానంతగా కాలిపోయాయని కేంద్ర మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్(Kirthivardhan Singh) గురువారం తెలిపారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఎ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.
కువైట్: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) భారతీయుల మృతదేహాలు గుర్తుపట్ట రానంతగా కాలిపోయాయని కేంద్ర మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్(Kirthivardhan Singh) గురువారం తెలిపారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఎ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కువైట్‌కి వెళ్లిన కీర్తి వర్ధన్ సింగ్.. మృతదేహాలను తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. "మృతదేహాలను గుర్తించిన వెంటనే, వారి బంధువులకు సమాచారం చేరవేస్తాం.
భారత వైమానిక దళ విమానం మృతదేహాలను తిరిగి తీసుకువస్తుంది" అని ఆయన తెలిపారు. తాజా లెక్కల ప్రకారం, మంగాఫ్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 48 మంది మరణించారని, వారిలో 42 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున వంటగదిలో మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో భవనంలో దాదాపు 200 మంది ఉన్నారు. వారంతా గాఢ నిద్రలో ఉండగా ఊపిరి సలపనీయకుండా పొగ రావడంతో.. దాన్ని పీల్చుకునే అధిక మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. కువైట్ ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.
ఘటనపై పూర్తి విచారణ జరిపి కారకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు +965-65505246 అనే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. బాధితుల పేర్లతో కూడిన తొలి జాబితా ఇవాళ వెలువడే అవకాశం ఉంది.
భవనంలో 160 మందికి పైగా ఎలా ఉంటున్నారనే దానిపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. కాగా బాధితుల్లో అయిదుగురు తమిళనాడుకి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. వారి కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారిందని.. అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి కేఎస్ మస్తాన్ చెప్పారు. కువైట్ మొత్తం జనాభాలో 21 శాతం భారతీయులే ఉన్నారు.