Share News

Floods: తీవ్ర వరదల కారణంగా 150 మందికి పైగా మృతి

ABN , Publish Date - Nov 01 , 2024 | 10:00 AM

స్పెయిన్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో బురద ఏర్పడి ఎక్కడికక్కడ చిత్తడిగా మారింది. దీంతో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Floods: తీవ్ర వరదల కారణంగా 150 మందికి పైగా మృతి
Spain Floods

ఇటివల కుండపోత వర్షాల కారణంగా స్పెయిన్‌(Spain)లో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో తూర్పు స్పెయిన్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య గురువారం రాత్రి నాటికి 158కి చేరుకుంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ఇంకా వెతుకులాట కొనసాగిస్తోంది. ఈ విపత్తు గత ఐదు దశాబ్దాల్లో యూరప్‌లోనే అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం 158 మంది మరణించారని మంత్రి ఏంజెల్ విక్టర్ టోరెస్ అన్నారు. ఇంకా పదుల సంఖ్యలో చేరవచ్చని, పదుల సంఖ్యలో మరికొంత మంది తప్పిపోయారని పేర్కొన్నారు. స్పెయిన్ తూర్పు ప్రాంతం, వాలెన్సియాతో పాటు చుట్టుపక్కల ఉన్న అల్బాసెట్, క్యూన్కా ప్రావిన్స్‌లలో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి.


ఏడాది వర్షం 8 గంటల్లోనే

వాలెన్సియా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఎనిమిది గంటల్లోనే ఏడాదిలో కురియాల్సినంత వర్షం కురిసింది. దీంతో ఈ వరదలను ఆధునిక స్పెయిన్ చరిత్రలో అత్యంత ఘోరమైన వరద విపత్తుగా ప్రకటించారు. వాతావరణ మార్పులు అక్కడి ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయని అధికారులు అంటున్నారు. 2021 సంవత్సరంలో జర్మనీలో భారీ వరదల కారణంగా సుమారు 185 మంది మరణించారు. అంతకుముందు 1970లో రొమేనియాలో 209 మంది ప్రాణాలు కోల్పోయారు. 1967లో పోర్చుగల్‌లో వరదల కారణంగా దాదాపు 500 మంది చనిపోయారు.


ప్రతిపక్షాల ఆగ్రహం

వాలెన్సియా నగర శివార్లలోని గ్యారేజీలో చిక్కుకున్న స్థానిక పోలీసు సహా ఎనిమిది మంది మృతదేహాలను రెస్క్యూ బృందాలు గురువారం వెలికితీసినట్లు మేయర్, జోస్ కాటల్లా మీడియాకు తెలిపారు. లా టోర్రే సమీపంలోని ఓ ఇంట్లో 45 ఏళ్ల మహిళ కూడా శవమై కనిపించింది. నీరు వంటి నిత్యావసర వస్తువుల కోసం వేలాది మంది ప్రజలు గురువారం లా టోర్రే నుంచి డౌన్‌టౌన్ వాలెన్సియాలో ప్రాంతాల్లో గుమిగూడారు. స్పెయిన్‌లో వరదల కారణంగా ఏర్పడిన విధ్వంసంపై అక్కడి ప్రతిపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ టీమ్‌లను నెమ్మదిగా పంపి పని చేయిస్తున్నారని ఆరోపించారు. పౌరుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ అధికారులదేనని అన్నారు.


ఈ సేవలన్నీ బంద్

ప్రజలను సకాలంలో హెచ్చరించి ఉంటే, అనేక మంది చనిపోయేవారు కాదన్నారు. వరదలు సంభవించే ప్రమాదం గురించి ప్రజలను హెచ్చరించలేదని పపోరాటా నగర మేయర్ మారిబెల్ అల్బలాట్ అన్నారు. తాము ఉండే నగరంలో 62 మంది మరణించారని ఆయన వెల్లడించారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మాడ్రిడ్, వాలెన్సియా మధ్య రైలు సేవలు కూడా నిలిపివేయబడ్డాయి. దీంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఇతర ప్రజా సేవలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాలెన్సియాలోని పాఠశాలలు, మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు గురువారం మూసివేయబడ్డాయి. స్పెయిన్ ప్రధాని కూడా గురువారం నుంచి మృతులకు సంతాపం ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 01 , 2024 | 10:01 AM