Sunita Williams: ఐఎస్ఎస్ నుంచి భూమికి సునీతా విలియన్స్.. ఎప్పుడు వస్తారో ప్రకటించిన నాసా
ABN , Publish Date - Aug 25 , 2024 | 11:14 AM
కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. 80 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ విల్ మోర్ భూమికి ఎప్పుడు తిరిగొస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక ప్రకట చేసింది.
కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. 80 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ విల్ మోర్ భూమికి ఎప్పుడు తిరిగొస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక ప్రకట చేసింది. ఫిబ్రవరి 2025లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తిరిగి భూమికి రానున్నారని నాసా శనివారం ప్రకటించింది.
ప్రకృతిపై ఆధారపడి టెస్ట్ ఫ్లైట్ నడపడం సురక్షితమైనది కాదని, సాధారణ విషయం కూడా కాదని, అందుకే వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెల్లడించారు. ఇద్దరు వ్యోమగాముల భద్రత విషయంలో నిబద్ధతతో ఉన్నామని, ఇదంత తేలికైన నిర్ణయం కాకపోయినప్పటికీ ఇదే సరైన నిర్ణయమని నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ ఫ్రీ పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్, విల్ మోర్ ఇద్దరూ ‘స్టార్‌లైనర్ క్యాప్సూల్’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తడంతో ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. ఎనిమిది రోజుల టెస్ట్ మిషన్ కోసం ఇద్దరూ జూన్ 5న ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అయితే స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో తొలి 24 గంటలలోనే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో నెలల తరబడి అక్కడే వ్యోమగాములు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లోని మొత్తం 28 థ్రస్టర్లు ఉండగా అందులో 5 విఫలమయ్యాయి. దీంతో థ్రస్టర్‌లను ప్రెషర్ పెంచడానికి ఉపయోగించే హీలియం పలు చోట్ల లీక్ అయ్యింది.