Trump:హష్‌మనీ కేసులో...చిక్కుల్లో ట్రంప్
ABN , Publish Date - Dec 17 , 2024 | 02:49 PM
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. హష్‌మనీ కేసులో ఊరట పొందాలని భావించిన ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు అనుకోని విధంగా...
ఎన్నికల్లో రికార్డు విజయం తర్వాత రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ప్రజాక్షేత్రంలో గెలుపు సాధించినా...న్యాయస్థానంలో మాత్రం చుక్కెదురైంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డానియల్‌కు హష్‌మనీ వ్యవహారంలో ఇదివరకే దోషిగా తేల్చింది న్యూయార్క్ కోర్టు. దీంతో ఇప్పటికే 34 రకాల అంశాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్...అధ్యక్షహోదాలో క్రిమినల్ విచారణల నుంచి ఊరట పొందాలని భావించాడు. కానీ, అందుకు భిన్నంగా ట్రంప్ తరపు న్యాయవాదుల వాదనను నిరాకరిస్తూ తీర్పు వెల్లడించారు.....మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్. వివాదాల మధ్యే అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఇది విపత్కర పరిస్థితే.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ట్రంప్. పోర్న్‌స్టార్‌కు హష్‌మనీ కేసులో ఇప్పటికే దోషిగా ఖరారు కావడంతో... ఈ ఏడాది నవంబర్‌లో శిక్షపడే ఛాన్స్ ఉంది. దీంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు ట్రంప్. అధ్యక్షుడిగా ఎంపికైన తనకు క్రిమినల్ విచారణ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు. బాధ్యతలు చేపట్టక మునుపే ఊరట ఈ కేసు విషయంలో ఊరట చెందాలని ఆశించిన ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డానియల్‌కు హష్‌మనీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చెల్లవని న్యూయార్క్ కోర్టు స్పష్టంచేసింది. అధికారికంగా చేసిన చర్యలకు మాత్రమే అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తికి చట్టపరమైన రక్షణ లభిస్తుందని...అనధికారిక ప్రవర్తన విషయంలో ఆ నియమం వర్తించదని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేశారు...న్యాయమూర్తి జునాన్ మర్చన్.
ట్రంప్ అభ్యర్థనను న్యూయార్క్ కోర్టు తిరస్కరించడంతో...సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందే హష్‌మనీ కేసులో ఊరట లభిస్తే సరి. లేకపోతే క్రిమినల్ కేసులో దోషిగా తేలి శ్వేతసౌధంలో అడుగుపెట్టబోయే తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలవనున్నారు ట్రంప్.
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో 1.30 లక్షల డాలర్లు పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్‌కు చెల్లించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. వారి మధ్య సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు... ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ విషయమై స్మార్టీ డానియెల్స్ సహా 22 మందిని విచారించిన న్యూయార్క్ కోర్టు ఈ అభియోగాలు నిజమేనని తేల్చింది. ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ...ఈ ఏడాది నవంబరులో శిక్ష ఖరారు చేస్తామని తీర్పు వెలువరించింది.