Nobel Prize in Chemistry 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ABN , Publish Date - Oct 09 , 2024 | 04:55 PM
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబుల్ బహుమతి.. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్‌తోపాటు జాన్ జంపర్‌ను వరించింది. ప్రోటీన్ల ఆవిష్కరణలో అందించిన సేవలకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
స్వీడన్, అక్టోబర్ 09: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబుల్ బహుమతి.. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్‌తోపాటు జాన్ జంపర్‌ను వరించింది. ప్రోటీన్ల ఆవిష్కరణలో అందించిన సేవలకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూఎస్ఏలో సీయాటెల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన డేవిడ్ బేకర్.. ప్రోటీన్ గణన రూపకల్పన కోసం విశేష కృషి చేశారని వివరించింది.
Also Read: Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు
అలాగే లండన్‌కు చెందిన డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లు ప్రోటీన్ నిర్మాణాన్ని అంచనా వేశారని పేర్కొంది. ఈ ఏడాది గుర్తించిన అద్బుతమైన ఆవిష్కరణల్లో ప్రోటీన్ల నిర్మాణం ఒకటని రసాయన శాస్త్రానికి సంబంధించిన నోబెల్ కమిటీ చైర్మన్ హీనర్ లింకే వెల్లడించారు. ప్రోటీన్ నిర్మాణాలను వాటి అమైనో ఆమ్ల శ్రేణుల నుంచి అంచనా వేయడం మరొకటని ఈ సందర్భంగా హీనర్ లింకే తెలిపారు. ఇది 50 ఏళ్ల నాటి కల అని గుర్తు చేశారు. ఈ రెండు ఆవిష్కరణలు విస్తారమైన అవకాశాలను కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
నూతన ప్రోటీన్లను రూపొందించడంలో డేవిడ్ బేకర్.. అసాధారణమైన ప్రతిభ కనబరిచారని వివరించారు. అలాగే దాదాపు ఐదు దశాబ్దాల నాటి సవాల్.. ప్రోటీన్ల సంక్లిష్ట త్రిమితీయ నిర్మాణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లు అంచనా వేసి అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు.
Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?
ఇప్పటికే భౌతిక, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లను వరించింది. వీరిద్దరు కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్‌ను సాధ్యం చేసేలా సిద్దాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. దీంతో వీరిద్దరిని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.
ఇక వైద్య శాస్త్రంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణతోపాటు జన్యు నియంత్రణలో దాని పాత్రను వీరిద్దరు వివరించారు. ఈ నేపథ్యంలో వారిద్దరికి నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇక మరికొద్ది రోజుల్లో శాంతి, సాహిత్య విభాగాల్లో సైతం ఈ నోబెల్ పురస్కారాలను ప్రకటించనుంది. డిసెంబర్ 10వ తేదీన స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విజేతాలకు ఈ నోబెల్ పురస్కారాలను అందజేయనున్నారు.
For International News And Telugu News...