Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం.. మాస్కో వెళ్లనున్న అజీత్ ధోవల్
ABN , Publish Date - Sep 08 , 2024 | 04:48 PM
రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించబోతోందా? ఈ మేరకు త్వరలోనే తనవంతు ప్రయత్నం మొదలుపెట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేపట్టేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ఈ వారంలోనే రష్యా వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించబోతోందా? ఈ మేరకు త్వరలోనే తనవంతు ప్రయత్నం మొదలుపెట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేపట్టేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ఈ వారంలోనే రష్యా వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత రెండు నెలల వ్యవదిలో ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌లో కూడా పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అజీత్ ధోవల్ రష్యా పర్యటన పరిణామం తెరపైకి వచ్చింది.
కాగా ఉక్రెయిన్ పర్యటన అనంతరం ఆగస్టు 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరంద్ర మోదీ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ సంభాషణలోనే ఒక పరిష్కారానికి రావాలని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్‌ను రష్యా పంపించాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అజీత్ ధోవల్ ఎప్పుడు మాస్కోకు వెళ్తారనేది తెలియరాలేదు.
కాగా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై మోదీ, పుతిన్ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల ప్రకటించింది. ‘‘ ప్రధాని మోదీ ఇటీవలి ఉక్రెయిన్ పర్యటనలో గ్రహించిన విషయాలను పుతిన్‌తో పంచుకున్నారు. చర్చలు, దౌత్య విధానంలో వివాదానికి ముగింపు పలికేందుకు భారత్ చేయాల్సిన సాయం చేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు’’ అని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని మోదీ కూడా తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారానికి భారత్ తన వంతు సాయం అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.