Share News

Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:15 PM

రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా

ఢాకా: రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నారు.


భారత్‌లో అడుగుపెట్టిన హసీనా!

మరోవైపు నిరసనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బంగ్లాదేశ్ సైనిక హెలికాప్టర్‌లో తన అధికారిక నివాసం ‘బంగాభబన్’ నుంచి బయలుదేరి వెళ్లారు. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.


భారత్-బంగ్లా సరిహద్దు భద్రత పెంపు

షేక్ హసీనా భారత్‌కు వచ్చిన నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు బీఎస్ఎఫ్ ఈ చర్యలు తీసుకుంది.


బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధింపు..

బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారనే కథనాల నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తామని వివరించారు. భద్రత కోసం ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని, దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 04:01 PM