Share News

Saudi Arabia : ఎడారిలో దారి తప్పి.. నమాజ్‌ చేస్తూ మృత్యువాత

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:00 AM

కనుచూపు మేరలో ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. మండిపోతున్న ఎండకు తోడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితి.. గమ్యం చేరాలంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.. జీపీఎస్‌ సిగ్నల్‌ పని చేయడం లేదు.

Saudi Arabia : ఎడారిలో దారి తప్పి.. నమాజ్‌ చేస్తూ మృత్యువాత

  • సహోద్యోగితో కలిసి సౌదీలో కరీంనగర్‌ యువకుడి దుర్మరణం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కనుచూపు మేరలో ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. మండిపోతున్న ఎండకు తోడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితి.. గమ్యం చేరాలంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.. జీపీఎస్‌ సిగ్నల్‌ పని చేయడం లేదు. బ్యాటరీ అయిపోయి మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఎవరినైనా మార్గం అడుగుదామంటే మనిషి అనేవాడి జాడే లేదు. దారి వెతుక్కుంటూ అటుఇటు తిరగడంతో కారులో ఉన్న కాస్త ఇంధనం కూడా ఖాళీ అయింది.

దిక్కుతోచని స్థితిలో ఆకలిదప్పులను దిగమింగుకుని ఎడారిలో నాలుగు రోజులు పాటు గడిపిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు చివరకు నమాజ్‌ చేస్తూ ప్రాణం వదిలాడు. సాదీ అరేబియాలోని అత్యంత ప్రమాదకరమైన రుబా అల్‌ ఖలీ అనే ఎడారిలో జరిగిన ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన మొహమ్మద్‌ షహేబాజ్‌ ఖాన్‌(27) అత్యంత దయనీయ స్థితిలో మరణించాడు.


కరీంనగర్‌కు చెందిన షహేబాజ్‌ సౌదీ అరేబియాలోని అల్‌ హాసా ప్రాంతంలోని ఒక టెలికం కంపెనీలో టవర్‌ టెక్నిషియన్‌గా పని చేసేవాడు. విధి నిర్వహణలో భాగంగా సుడాన్‌కు చెందిన సహచర ఉద్యోగితో కలిసి షహేబాజ్‌ ఐదు రోజుల క్రితం కారులో ఓ చోటుకి వెళ్లాడు. ఈ క్రమంలో జీపీఎస్‌ సక్రమంగా పని చేయకపోవడంతో దారి తప్పి రుబా అల్‌ ఖలీ ఎడారికి చేరుకున్నారు.

నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న ఈ ఎడారిలో దారి తప్పితే మరణమే శరణమ్యని స్థానికంగా నమ్ముతారు. ఈ ఎడారిలో ఒంటెలు ఉండవు కనీసం కాలినడకన కూడా ప్రయాణించలేం. అలాంటి భయంకరమైన ప్రాంతంలో ఇరుక్కుపోయిన షహేబాజ్‌ జీవితంపై ఆశలు వదులుకున్నాడు.

తన కారు పక్కనే ఇసుకలో చాప (జనిమాజ్‌) పరిచి నమాజ్‌ చేస్తూ సహచరునితో కలిసి ప్రాణాలు కోల్పోయాడు. వీరి గల్లంతుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు హెలికాప్టర్ల సాయంతో గాలించి.. నమాజ్‌ చేసే చాపపై పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 04:00 AM