Share News

America Floods: వరద బీభత్సానికి బద్దలైన డ్యామ్.. 30 లక్షల మందికి పైగా..

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:52 PM

ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటం వల్ల అమెరికాలో వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ దెబ్బకు ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలు వరద బీభత్సంతో...

America Floods: వరద బీభత్సానికి బద్దలైన డ్యామ్.. 30 లక్షల మందికి పైగా..
America Floods

ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటం వల్ల అమెరికాలో వరదలు (America Floods) తీవ్రరూపం దాల్చాయి. ఈ దెబ్బకు ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలు వరద బీభత్సంతో అల్లాడిపోతున్నాయి. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు.. మిన్నెసోటాలోని బ్లూఎర్త్‌ కౌంటీలో ఉన్న ‘ది ర్యాపిడాన్‌ డ్యామ్‌’ బద్దలైంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక డ్యామ్ కుదేలైంది. దీంతో.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ డ్యామ్‌ని పరిశీలించిన అధికారులు.. ఇది కొంతమేర దెబ్బతిందని, దాని ఎడమవైపు భాగంలో గోడ బద్దలయ్యిందని పేర్కొన్నారు.


కేవలం డ్యామ్ మాత్రమే కాదండోయ్.. ఒక రైల్వే వంతెన సైతం సర్వనాశనం అయ్యింది. ఐయోవా నుంచి దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలిపే ఈ వంతెన.. భారీ వరదల దెబ్బకు రెండు ముక్కలైంది. అటు.. స్పెన్సర్‌ నగరంతో పాటు క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడం, మరికొన్ని నీటి ప్రవాహం ధాటిగి తెగిపోవడం వల్లే.. నగరాల మధ్య అనుసంధానం తెగింది. ఈ వరద బీభత్సం గురించి ఐయోవా గవర్నర్‌ కిమ్‌ రేనోల్డ్స్‌ మాట్లాడుతూ.. 1993 తర్వాత ఇలాంటి భయానక పరిస్థితుల్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. నగరంలోకి ప్రధాన వ్యాపారాలు మూతపడ్డాయని.. ఆసుపత్రులను సైతం ఖాళీ చేయించామని వెల్లడించారు. మరోవైపు.. ఐయోవాలోని రెండు కౌంటీలు నీట మునగగా.. సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.


కాగా.. సియోక్స్ ప్రాంతంలో ఏడు అంగుళాల భారీ వర్షపాతం నమోదు కాగా, ఐయోవాలోని రాక్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో 11 అంగుళాల వాన పడింది. విడతల వారీగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాల కారణంగానే.. అమెరికాలో ఈ భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని జోసఫ్‌ అనే వాతావరణ నిపుణుడు స్పష్టం చేశారు. భారీ వర్షాల దెబ్బకు నేల పూర్తిగా తేమతో నిండిపోయిందని.. ఫలితంగా నీరు భూమిలోకి ఇంకడం లేదని.. నేలపై నీరు నిలిచిపోయి వరదగా మారిందని వివరించాడు.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 09:52 PM