Trump Shooter: ట్రంప్‌పై కాల్పులకు ముందు మాస్టర్ ప్లాన్.. అతడేం చేశాడో తెలుసా?
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:49 PM
థామస్ మాథ్యూ క్రూక్స్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడం వల్లే.. ఆ 20 ఏళ్ల యువకుడు హాట్ టాపిక్‌గా...
థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Mathew Crooks).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కాల్పులు జరపడం వల్లే.. ఆ 20 ఏళ్ల యువకుడు హాట్ టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. అతను ఎందుకు ఈ కాల్పులు జరిపాడు? అతని ఉద్దేశం ఏంటి? అనే విషయాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే.. ట్రంప్‌పై దాడి చేయడానికి గల కారణాలేంటో ఇంతవరకూ వెలుగులోకి రాలేదు కానీ, తాజాగా నిందితుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాల్పులు జరపడానికి ముందు అతడేం చేశాడనే కీలక విషయాలను విచారణలో వెల్లడయ్యాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌పై దాడి చేయడానికి ఒక రోజు ముందు థామస్ ‘షూటింగ్ రేంజ్’ వద్ద తుపాకి కాల్చడాన్ని ప్రాక్టీస్ చేశాడు. సరైన గురి ఎలా పెట్టాలనే విషయంపై కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మరుసటి రోజు ఉదయం.. హోమ్ డిపోకి వెళ్లి ఐదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేశాడు. ఆపై ఓ తుపాకి దుకాణానికి వెళ్లి.. 50 రౌండ్ల మందుగుండు సామాగ్రిని కొన్నాడు. తాను కొనుగోలు చేసిన నిచ్చెన సహకారంతోనే క్రూక్స్ ఆ బిల్డింగ్ ఎక్కినట్లు తేలింది. మరోవైపు.. ఈ దాడి వెనుక థామస్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం అధికారులు అతని ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు (FBI) చెందిన టెక్నీషియన్లు వాటిని శోధిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎన్నికల ప్రచారాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. శనివారం పెన్సిల్వేనియాలో ఓ ర్యాలీ నిర్వహించారు. అక్కడికి వందలాది మంది తరలివచ్చారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా.. ఒక బుల్లెట్ ఆయనవైపు దూసుకొచ్చింది. అయితే.. అదృష్టవవాత్తూ ఈ ఘటనలో ఆయన బతికి బయటపడ్డారు. ఆ బుల్లెట్ చెవిని తాకడంతో గాయమైంది. క్రూక్స్ ఈ దాడి చేసిన కొన్ని క్షణాల్లోనే.. సీక్రెట్ సర్వీస్ స్నైపర్ అతడిని కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే కదిలించింది. కాగా.. ఈ దాడి తర్వాత ట్రంప్‌కి వస్తున్న మద్దతు చూసి, ఆయన విజయం తథ్యమని నిపుణులు జోస్యం చెప్తున్నారు.
Read Latest International News and Telugu News