Bonza Airlines: అకస్మాత్తుగా ఫ్లైట్లన్నీ రద్దు చేసిన ఎయిర్‌లైన్స్.. ప్రయాణికులకు షాక్!
ABN , Publish Date - Apr 30 , 2024 | 06:36 PM
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా బడ్జెట్ ఎయిర్‌లైన్స్ బోంజా అకస్మాత్తుగా మంగళవారం ఫ్లైట్లను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు ఇక్కట్లపాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికకష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా (Australia) బడ్జెట్ ఎయిర్‌లైన్స్ బోంజా (Bonza Airlines) అకస్మాత్తుగా మంగళవారం ఫ్లైట్లను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు ఇక్కట్లపాలయ్యారు. ఆస్ట్రేలియాలో వ్యాప్తంగా ఈ రద్దు ప్రభావం కనిపించింది. సన్‌షైన్‌కోస్ట్, మెల్బోర్న్, గోల్డ్ కోస్ట్, ఆవలాన్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు విమానాశ్రయాలకు చేరుకున్నాక విషయం తెలిసి కంగుతిన్నారు.
విమాన సర్వీసులన్నీ రద్దు చేసినట్టు సంస్థ సీఈఓ టిమ్ జోర్డన్ ధ్రువీకరించారు. సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే వరకూ తాత్కాలికంగా సర్వీసులన్నిటినీ రద్దు చేసినట్టు ప్రకటించారు. గురువారం వరకూ సర్వీసులేవీ అందుబాటులోఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఎవరూ విమానాశ్రాలకు రావద్దని సూచించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు (Australian Airline Bonza Abruptly Cancels All Flights).
దివాల ప్రక్రియకు సంబంధించి సంస్థ పగ్గాలను అడ్మినిస్ట్రేటర్‌కు అప్పగించినట్టు కూడా బోంజా ఓ ప్రకటనలో పేర్కొంది. సంస్థ కార్యకలాపాలను కొనసాగించాలా లేదా సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించాలా అన్నది త్వరలో పెట్టుబడిదారులందరితీ చర్చించాక రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేటర్ ఓ నిర్ణయం తీసుకుంటారు.
Viral: వామ్మో.. రూ.333ల పానీ పూరీ.. ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే!
చౌక ధరలకు విమానసర్వీసుల హామీతో బోంజా 2021లో క్వీన్స్‌ల్యాండ్‌లో ప్రారంభమైంది. ఈ సంస్థ కేవలం దేశీ గమ్యస్థానాల మధ్య సంస్థ సర్వీసుల నిర్వహించాలనే లక్ష్యంతో పని ప్రారంభించింది. అయితే, అనుమతుల జారీలో జాప్యం కారణంగా 2023లో బోంజా సర్వీసులు ప్రారంభమయ్యాయి. కానీ, విమానలు, నిధుల కొరత కారణంగా సంస్థ మొదటి నుంచీ ఒడిదుడుకుల్లోనే కార్యకలాపాలను కొనసాగించింది. దీనికి తోడు.. లాభదాయక సిడ్నీ మార్కెట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ స్పాట్లు దక్కించుకోవడంలో బోంజా తడబడటంతో సంస్థ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు.. తాజా పరిణామాలపై ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రయాణికులకు సంస్థ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని బోంజాను ఆదేశించినట్టు తెలిపింది. ఇక, విమానయాన ట్రేడ్ యూనియన్లు కూడా సమావేశమయ్యాయి. అకస్మాత్తుగా కార్యకలాపాలు నిలిపివేడంతో ఉద్యోగులపై పడే ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు ప్రారంభించాయి.
‘‘బోంజా సంస్థ మొదట తన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సంస్థ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలి’’ అని రవాణా కార్మికుల యూనియన్ జాతీయ సెక్రెటరీ మైఖేల్ కేన్ అన్నారు. కార్పొరేట్ కంపెనీల దురాశ కారణంగానే విమాన టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయని, ఈ రంగంలోకి రావాలనుకుంటున్న చిన్న సంస్థలు మనగలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కాంతాస్, వర్జిన్ ఆస్ట్రేలియా విమాన సంస్థల ఆధిపత్యం నడుస్తోంది.
Read Interntional and Telugu News