Share News

World War 3: ఒకవేళ అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం జరగడం తథ్యం

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:34 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందా? అంటే అవుననే బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తమకు అమెరికా, జర్మనీతో పాటు ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి.. ఉక్రెయిన్ వివాదం ‘వరల్డ్ వార్ 3’గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

World War 3: ఒకవేళ అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం జరగడం తథ్యం

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందా? అంటే అవుననే బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ. తమకు అమెరికా, జర్మనీతో పాటు ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి.. ఉక్రెయిన్ వివాదం ‘వరల్డ్ వార్ 3’గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్‌కి కూడా తెలుసని తాను భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నాటో సభ్య దేశాలపై రష్యా దాడి చేస్తే.. అది తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. తన జర్మనీ పర్యటనలో భాగంగా.. ఆదివారం జర్మన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ARDకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జర్మనీ నుంచి ఉక్రెయిన్‌కు ‘టారస్‌ క్రూజ్‌ క్షిపణులు’ అందకపోవడంపై మీరు నిరాశ చెందారా? అని ప్రశ్నించినప్పుడు.. ఆ విషయంలో తాను పెద్దగా బాధ పడలేదని, కానీ ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడిన సమయంలో జర్మనీ తనవంతు పోషించాల్సిన పాత్రను పోషించలేదని, అది తనను నిరాశకు గురి చేసిందని జెలెన్‌స్కీ వివరించారు. అయితే.. రష్యాతో యుద్ధం విషయంలో జర్మనీతో పాటు ఇతర ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. రష్యాతో జరుగుతున్న ఈ యుద్ధంపై పైచేయి సాధించాలంటే.. ఉక్రెయిన్‌ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు. ఇదే సమయంలో.. అమెరికా మద్దతుపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వని వ్యక్తిగత రిపబ్లికన్‌లు కొందరు ఉన్నారని.. అయితే అత్యధిక మంది డెమొక్రాట్లు, రిపబ్లికన్‌లు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నారని జెలెన్‌స్కీ తెలిపారు. మరి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధిస్తే ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా? అని ప్రశ్నించగా.. ఆ దేశపు విదేశాంగ విధానం కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని సమాధానం ఇచ్చారు. అయితే.. అమెరికా నుంచి తమకు ఆర్థిక సహాయం తగ్గడంపై జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని.. రష్యాకు ఇది అనుకూలంగా మారే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 29 , 2024 | 03:34 PM