Mine Collapse: కూలిన గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు
ABN , Publish Date - Feb 22 , 2024 | 07:19 AM
సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు.
సెంట్రల్ వెనిజులా(Venezuela)లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని(gold pit mine) ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. ఆంగోస్తురా మునిసిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో అక్కడి మీడియాతో తెలిపారు. రెస్క్యూ పనులను కొనసాగిస్తున్నామని బాధితుల బంధువులు వేగంగా రెస్క్యూ ప్రయత్నాలను డిమాండ్(demand) చేస్తున్నారని ప్రస్తావించారు. గాయపడిన వారు, మృతదేహాలను వెలికితీసేందుకు విమానాన్ని పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.
వెనిజులా(Venezuela) ప్రభుత్వం 2016లో చమురు పరిశ్రమతో పాటు కొత్త ఆదాయాలను జోడించడానికి దేశం మధ్యలో విస్తరించి ఉన్న భారీ మైనింగ్ అభివృద్ధి జోన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బంగారం, వజ్రాలు, రాగి, ఇతర ఖనిజాల కోసం మైనింగ్ కార్యకలాపాలు ఆ జోన్ లోపల, వెలుపల విస్తరించాయి. ఆ క్రమంలోనే పలు ప్రాంతాల్లో అక్రమంగా అనేక గనులు ఏర్పాటయ్యాయి.