Plane Crash: కొరియా విమాన ప్రమాదానికి కారణం అదేనా.. వీరు మాత్రం సేఫ్..
ABN , Publish Date - Dec 29 , 2024 | 07:48 AM
దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగా జరిగిందని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొనడంతో, ల్యాండింగ్ గియర్ చెడిపోయి విమానం కూలిపోయిందని అంటున్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ కొరియా (South Korea)లోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం (Plane Crash) ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 181 మంది ప్రయాణికులతో, 6 మంది సిబ్బందితో కలిపి ప్రయాణిస్తున్న విమానం ఆదివారం ల్యాండింగ్ సమయంలో పక్షుల దాడి (Bird Strike) కారణంగా కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 62 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాదం జరగడానికి ముందు, విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ దాడితో విమానంలోని ల్యాండింగ్ గియర్ చెడిపోయి, అది విమానాన్ని పర్యవేక్షించలేకపోయింది. తద్వారా ఈ ఘోర ప్రమాదం మరింత పెరిగింది.
ఇప్పటివరకు ఇద్దరు సేఫ్
ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ, పోలీసు, ఇతర అత్యవసర సేవల బృందాలను తక్షణమే ఘటన స్థలానికి పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు విమానం నుంచి ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక అధికారులు రక్షించారు. రక్షించబడిన వారిలో ఒకరు ప్రయాణికుడు కాగా, మరొకరు సిబ్బంది అని అక్కడి స్థానిక వార్తా సంస్థ న్యూస్ 1 తెలిపింది. 2005లో స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు సేవలను అందిస్తోంది. తక్కువ ధరకు సేవలను అందిస్తున్న ఈ దక్షిణ కొరియా క్యారియర్ జెజు ఎయిర్‌కి ఇది మొదటి ఘోరమైన క్రాష్ అని చెబుతున్నారు.
ప్రమాదానికి కారణాలివేనా..
జెజు ఎయిర్ ఫ్లైట్ 2216 రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి మువాన్‌కు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు, ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడలను ఢీకొట్టిందని మరికొంత మంది చెబుతున్నారు. మరోవైపు పక్షుల దాడి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు. అంతేకాదు విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంత మంది చెబుతున్నారు. ఈ నివేదికల నేపథ్యంలో ప్రమాదం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం ఎందుకు జరిగిందనే వివరాలను అధికారులు తెలుపనున్నారు.
స్పందించిన అధ్యక్షుడు
దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్-మోక్ ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించారు. అన్ని సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. రాజధాని సియోల్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఆయన స్వయంగా వస్తున్నారు. ఈ ప్రమాదం తరువాత విమానాల భద్రతా ప్రమాణాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారికంగా క్రాష్‌కు కారణం ఏమిటన్నది పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More International News and Latest Telugu News