ఆవుల స్మగ్లర్ అనుకొని 12వ తరగతి విద్యార్థి కాల్చివేత
ABN , Publish Date - Sep 04 , 2024 | 06:14 AM
ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిలో దారుణం జరిగింది. ఆవుల స్మగ్లర్ అనుకొని కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరీ ఓ యువకుడిని(12వ తరగతి విద్యార్థి) ‘గో రక్షణ’ మూక తుపాకీతో కాల్చి చంపింది.
కారుతో 30 కిమీలు వెంబడించి కాల్పులు.. ‘గో రక్షణ’ మూకకు చెందిన ఐదుగురి అరెస్టు
ఫరీదాబాద్, సెప్టెంబరు 3 : ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిలో దారుణం జరిగింది. ఆవుల స్మగ్లర్ అనుకొని కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరీ ఓ యువకుడిని(12వ తరగతి విద్యార్థి) ‘గో రక్షణ’ మూక తుపాకీతో కాల్చి చంపింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. గత నెల 23వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఆవుల స్మగ్లర్లు రెండు ఎస్‌యూవీ కారుల్లో ఫరీదాబాద్‌లో రెక్కీ నిర్వహిస్తున్నారని ఆగస్టు 23వ తేదీ రాత్రి ‘గో రక్షణ’ మూకకు సమాచారం అందింది. అదే సమయంలో ఆర్యన్ మిశ్రా(19), హర్షిత్, శాంకీ అనే యువకులు తమ స్నేహితులైన మరో ఇద్దరు యువతులతో కలిసి ఎస్‌యూవీ కారులో అటుగా వెళ్లారు. హర్షిత్ కారు నడుపుతుండగా ఆర్యన్ మిశ్రా అతని పక్క సీట్లో కూర్చోని ఉన్నాడు. వాళ్లని ఆవుల స్మగ్లర్లగా భావించిన ‘గో రక్షణ’ మూక మరో కారుతో ఢిల్లీ- ఆగ్రా జాతీయ రహదారిలో సుమారు 30 కిలోమీటర్లు వాళ్లని వెంబడించింది.
తుపాకీలు చూపి కారు ఆపమని ఆ యువకులను పలుమార్లు హెచ్చరించింది. అయితే, ఆ మూకను దోపిడి దొంగలుగా భావించిన యువకులు వారి బెదిరింపులకు భయపడి తమ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో గదపురి టోల్ ప్లాజా వద్ద పెట్టిన బ్యారికేడ్లను ఢీకొట్టి వెళ్లారు. దీంతో ‘గో రక్షణ’ మూకకు చెందిన వారు తుపాకీతో కాల్పులు జరపగా.. ఆర్యన్ మిశ్రాకు బుల్లెట్ గాయమైంది. ఆపై, హర్షిత్ వాహనాన్ని నిలిపివేయగా.. దూసుకొచ్చిన ‘గో రక్షణ’ మూక సభ్యులు ఆర్యన్ గుండెల్లోకి నేరుగా మరోసారి కాల్చారు. దీంతో ఆర్యన్ మిశ్రా అక్కడికక్కడే మరణించాడు. అనంతరం కారులో మరో ఇద్దరు యువతులను చూసిన ‘గో రక్షణ ’ మూక తాము దాడి చేసింది స్మగ్లర్లపై కాదని గ్రహించి పరారయ్యారు. పరారైన ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆర్యన్ మిశ్రా అతని స్నేహితులపై కాల్పులు జరిపింది ‘గో రక్షణ’ మూక అనేందుకు తగిన ఆధారాల్లేవని ఫరీదాబాద్ ఏసీపీ(క్రైమ్) అమన్ యాదవ్ విలేకరులతో అన్నారు.
అయితే, గో సంరక్షణకు సంబంధించి నిందితులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక, ఆర్యన్ మిశ్రా అతని స్నేహితులను వెంబడించిన వారిలో తన కుమారుడు ఉన్న మాట నిజమే కానీ అతను నిరపరాధి అని నిందితుల్లో ఒకరైన అనిల్ కౌశిక్ తల్లి విలేకరులతో అన్నారు. మరణించిన యువకుడు ఉన్న కారులో నుంచే మొదటి బుల్లెట్ వచ్చిందని కౌశిక్ తనకు చెప్పాడని తెలిపారు. గో సంరక్షణ చేస్తూ తన కొడుకు సమాజ సేవ చేస్తుంటాడని ఆమె పేర్కొన్నారు.