BJP: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్.. బయటకి ఎత్తుకెళ్లిన మార్షల్స్
ABN , Publish Date - Aug 01 , 2024 | 05:20 PM
సభ వ్యవహారాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 18 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి రెండ్రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకి రావడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో మార్షల్స్ వారిని ఎత్తుకుని బయటకు పంపేశారు.
రాంచీ: సభ వ్యవహారాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 18 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి రెండ్రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకి రావడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో మార్షల్స్ వారిని ఎత్తుకుని బయటకు పంపేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే.. విపక్షాలు సంధించిన పలు కీలక ప్రశ్నలకు సీఎం హేమంత్ సోరెన్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించనే కారణంతో బీజేపీ ఎమ్మెల్యేలు జులై 31న సభలో నిరసనలు తెలపడం ప్రారంభించారు. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభలో నినాదాలు చేశారు. కొన్ని కీలక పత్రాలను చించివేశారు. దీంతో సభ ప్రారంభానికి ముందు అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు.
సభాపతి రవీంద్రనాథ్ బీజేపీ సభ్యులను వారించారు. అయినా వినకుండా సభ్యులు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. అనంతరం 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ ఆమోదంతో మిగతా సభ్యులంతా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపారు. వారిని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
తమను సస్పెండ్ ఎందుకు చేశారని నిలదీస్తూ బీజేపీ సభ్యులు బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో అనంత్ ఓజా, రాజ్ సిన్హా, నీరా యాదవ్, కిషున్ దాస్, సీపీ సింగ్, కేదార్ హజ్రా, అపర్ణా సేన్‌గుప్తా, బిరంచి నారాయణ్, సమ్రీ లాల్, నవీన్ జైస్వాల్, శశి భూషణ్ మెహతా, పుష్పా దేవి, నారాయణ్ దాస్, కోచె, భాను ప్రతాప్ షాహి, అమిత్ మండల్ ఉన్నారు. సస్పెండ్ తరువాత నేతలంతా అసెంబ్లీ బయటే రాత్రంతా నేలపై పడుకుని.. మరుసటి రోజు ఉదయం వరకు నిరసనలు కొనసాగించారు. వారంతా సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎథిక్స్ కమిటీ విచారణ..
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి వారం రోజుల్లో నివేదికను అందజేస్తుందని స్పీకర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో నియంతృత్వం రాజ్యం కొనసాగుతోందని విపక్ష నేత అమర్ ఆరోపించారు. హేమంత్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఆయన అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనుండగా.. అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది.