Dubai: 2.9 లక్షల కోట్లు.. 400 గేట్లు
ABN , Publish Date - Apr 29 , 2024 | 04:58 AM
ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం ప్రకటించారు.
దుబాయ్, ఏప్రిల్ 28: ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం ప్రకటించారు. ఇది ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయం కానుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి ఇది అయిదు రెట్లు పెద్దదిగా ఉండనుంది. 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు) వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. వచ్చే పదేళ్లలో దీన్ని పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు పొందింది. రద్దీ పెరుగుతుండడం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎయిర్ పోర్టులో రెండు రన్‌వేలు ఉండగా, కొత్తదాంట్లో అయిదు సమాంతర్ రన్‌వేలను నిర్మిస్తారు. 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. దుబాయ్ దక్షిణ ప్రాంతంలో దీన్ని నిర్మిస్తారని, దీనిని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తారని దేశాధినేత ప్రకటించారు.