Share News

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:55 AM

ఉగ్రవాదులను తుదముట్టించే పోరులో మరో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాశారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో జరిగింది.

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

న్యూఢిల్లీ: ఉగ్రవాదులను తుదముట్టించే పోరులో మరో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాశారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో జరిగింది. మరణించిన వారిలో ఒక అధికారి కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల జాడపై నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.


రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని భారత ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. పలువురు సైనికులకు గాయాలయినట్టు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోందని వివరించింది. ఇంటెలిజెన్సీ సమాచారంతో సైనికులు రంగంలోకి దిగారని వివరించింది. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నట్టు ఆర్మీ వెల్లడించింది.


జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగి రెండో అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. గతవారం కథువాలో ఐదుగురు సైనికులు మరణించారని, ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని చెప్పారు. కాగా జమ్మూ ప్రాంతంలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ఆర్మీని కోరారు. దీంతో బలగాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతూ ఉగ్రమూకలను ఏరివేస్తు్న్నాయి.

Updated Date - Jul 16 , 2024 | 08:14 AM