Share News

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:25 PM

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జకీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్సు రైలుకి చెందిన 8 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఆయన్ను రఫీక్(70)గా గుర్తించారు.

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జకీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్సు రైలుకి చెందిన 8 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఆయన్ను రఫీక్(70)గా గుర్తించారు. ముగ్గురు సహోద్యోగులతో కలిసి రఫీక్ రైల్వే కాంట్రాక్టర్ కింద చెత్త సేకరించే పని చేస్తున్నాడని, ఈ ప్రమాదం సంభవించే సమయంలో ఆయన ఘటనా స్థలం వద్దే ఉండటంతో మృతి చెందాడని తెలిసింది. ఉదయం 11.52 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దం రావడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో.. చుట్టుపక్కల ఉండే స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.


ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించింది. ఒక బృందాన్ని పిలిపించి.. రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేయించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులతో పాటు మొబైల్ క్రైమ్ టీమ్‌ను కూడా స్పాట్‌కు పిలిపించారు. అదృష్టకరమైన విషయం ఏమిటంటే.. పక్క ట్రాక్‌లోనే ప్రయాణికులతో నిండిన ఒక రైలు ఆగి ఉంది. ఒకవేళ ఈ గూడ్సు రైలు అటువైపు బోల్తా పడి ఉంటే.. పెద్ద ప్రమాదమే సంభవించింది. అయితే.. బోగీలు మరోవైపు బోల్తా పడటంతో ఆ ప్రమాదం తప్పిందని అధికారులు చెప్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ట్రాక్ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఈ నెలలోనే 13వ తారీఖున ఢిల్లీలోని ప్రసాద్ నగర్ సమీపంలో ఓ రైలు కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో.. వివిధ అగ్నిమాపక కేంద్రాలకు చెందిన అరడజను అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి, సుమారు గంటన్నర సేపు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ఈ అగ్ని ప్రమాదం ప్రసాద్ నగర్ ప్రాంతానికి సమీపంలోని పటేల్ నగర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు.

Updated Date - Feb 17 , 2024 | 08:25 PM