Hajj Pilgrims: హజ్ యాత్రలో తీరని విషాదం.. వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి
ABN , Publish Date - Jun 20 , 2024 | 12:38 PM
హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు వడదెబ్బ కారణంగానే జరిగినట్లు వెల్లడించారు. పలువురు భారతీయులు అదృశ్యమైనట్లు గుర్తించారు. వారి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18.3 లక్షల మంది హజ్ యాత్రకు హాజరయ్యారు. హజ్ యాత్రలో మృతి చెందిన వారిలో 300 మంది ఈజిప్టు వాసులు ఉన్నారు.
మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో వృద్ధులు వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నారు. ఈ యాత్రకు హాజరైన వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని హజ్ నిర్వాహకులు వెల్లడించారు. వివిధ కారణాలతో చనిపోయిన యాత్రికులు మృతదేహాలను మక్కాలోని అల్-ముయిసెమ్ ఆసుపత్రిలో భద్రపరిచామని, కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు అదృశ్యమైన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని ఈజిప్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియా, ఇరాక్, కుర్దిష్ ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా మృతుల్లో ఉన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది 240 మరణాలు నమోదుకాగా.. వీరిలో ఇండోనేషియాకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. అసలే ఎడారి ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని యాత్రికులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హజ్‌కి వచ్చే యాత్రికులకు సూచిస్తున్నారు. ముస్లింలు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీవిత కాలంలో ఒకసారైనా ఈ యాత్రకు వెళ్లాలని అనుకుంటారు.
For Latest News and National News click here