Share News

బిహార్‌కు బొనాంజా

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:04 AM

ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్‌ చేసినా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించింది. పట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రె్‌సవే,

బిహార్‌కు బొనాంజా

బడ్జెట్‌లో 26 వేల కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 23: ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్‌ చేసినా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించింది. పట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రె్‌సవే, బక్సర్‌-భాగల్పూర్‌ హైవే, బోధ్‌గయ-రాజ్‌గీర్‌-వైశాలి-దర్భంగా హైవే, బక్సర్‌ వద్ద గంగానదిపై రెండు వరుసల వంతెన నిర్మాణం వీటిలో ఉన్నాయి. బిహార్‌, జార్ఖండ్‌, బెంగాల్‌, ఒడిసాల సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ ప్రణాళికకు రూపకల్పన చేయనున్నారు. అమృతసర్‌-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా బిహార్‌లోని గయలో పారిశ్రామికవాడ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే ఆ రాష్ట్రంలో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు నెలకొల్పుతుంది. క్రీడల మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుంది. ఏటా లక్ష మంది విద్యార్థులకు కేంద్రం నేరుగా 3 శాతం వడ్డీ రాయితీతో ఈ-వోచర్‌ రూపంలో రుణాలు ఇస్తుంది. రాష్ట్ర పర్యాటక రంగానికి పెద్దఎత్తున ఊతమివ్వనుంది. గయలోని విష్ణుపాద ఆలయ కారిడార్‌, మహాబోధి ఆలయ కారిడార్‌లను ప్రపంచ యాత్రా-పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. ప్రాచీన నగరాలైన రాజగృహ (రాజ్‌గీర్‌), నలంద పూర్వవైభవానికి ప్రణాళికలు రూపొందిస్తారు. అతిప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరిస్తారు. కాగా.. బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఇటీవల ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. మరో మిత్రపక్షం ఎల్‌జేపీ (రాంవిలాస్‌) నాయకుడు, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్‌ కూడా సమర్థించారు. కేంద్రం కుదరదని స్పష్టం చేసింది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో అంతర్‌మంత్రిత్వ బృందం బిహార్‌కు హోదా డిమాండ్‌ను పరిశీలించిందని.. జాతీయాభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) నిబంధనల ప్రకారం హోదా ఇవ్వడం కుదరదని సోమవారమే లోక్‌సభలో ప్రకటించింది. దీనిపై నితీశ్‌ రాజీనామా చేయాలని మాజీ సీఎం, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అయితే బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో నితీశ్‌, జేడీయూలను మోదీ ప్రభుత్వం సంతృప్తిపరచిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మాకు ప్రత్యేక సాయం: నితీశ్‌

కేంద్ర బడ్జెట్‌ బిహార్‌ సమస్యలకు పరిష్కారం చూపిందని సీఎం నితీశ్‌ అన్నారు. ‘మాకున్న సమస్యల వల్లే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేశాం. సాంకేతిక కారణాలతో హోదా ఇవ్వలేకపోతే.. ప్రత్యేక సాయం ఇవ్వాలని కోరాం. బడ్జెట్‌లో ఇప్పుడదే ప్రకటించారు’ అని తెలిపారు. బడ్జెట్‌పై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా.. అవునని బదులిచ్చారు.

Updated Date - Jul 24 , 2024 | 05:04 AM