AAP Sanjay Singh: 6 నెలలు తరువాత తీహార్ నుంచి విడుదలైన సంజయ్ సింగ్
ABN , Publish Date - Apr 03 , 2024 | 08:57 PM
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ (Liquor policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలు (Bail)పై విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
సంజయ్ సింగ్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు అందగానే ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు. విడుదలకు ముందు ఐఎల్‌బీఎస్ ఆసుపత్రిలో ఆయనకు మెడికల్ చెకప్ జరిగింది. సాయంత్ర ఆయన తిరిగి జైలుకు చేరుకున్నారు. గత అక్టోబర్‌లో ఈడీ ఆయనను అరెస్టు చేసినప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు.
బెయిల్ షరతులివే..
పలు షరతుల మీద సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆ షరతుల ప్రకారం ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ, సాక్షులను ప్రభావితం కానీ ఆయన చేయకూడదు. ఈ కేసులో తన పాత్ర గురించి ఎలాంటి కామెంట్లు చేయకూడదు. రూ.2 లక్షలు విలువ చేసే బెయిల్ బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించారు. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదు. పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సరెండర్ చేయాలి. ఎన్‌సీఆర్ నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా దర్యాప్తు అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎల్లప్పుడూ తన మొబైల్ లొకేషన్‌ను ఆన్ చేసి ఉండాలి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.