Abhijit Gangopadhyay: బెంగాల్ టీచర్స్ స్కామ్‌లో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బీజేపీలోకి..
ABN , Publish Date - Mar 05 , 2024 | 04:58 PM
బెంగాల్ టీచర్స్ కుంభకోణంతో సహా పలు అంశాల్లో కీలకమైన తీర్పులు చెప్పిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 7వ తేదీన బీజేపీలోకి చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్స్ కుంభకోణంతో సహా పలు అంశాల్లో కీలకమైన తీర్పులు చెప్పిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ (Abhijit Gangopadhyay) మంగళవారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 7వ తేదీన బీజేపీ (BJP)లోకి చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అభిజిత్ సోమవారంనాడే ఒక ప్రకటన చేశారు. న్యాయమూర్తిగా తన పాత్ర ముగిసిందనే అంతరాత్మ ప్రబోధం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన సమర్పించారు. రాజీనామా లేఖ ప్రతులను సీజేఐ డీవై చంద్రచూడ్, కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానంకు పంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. గత రెండేళ్లుగా విద్యాసంబంధిత అనేక అంశాలు, ముఖ్యంగా అవినీతి వ్యవహారాలపై తీర్పులు ఇచ్చానని, ఇక తన బాధ్యతలు పూర్తయ్యానని అంతరాత్మ ప్రబోధించడంతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ప్రజలకు మరింత విస్తృత సేవ చేసే రంగం వైపు వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో చేరాలనుకుంటునట్టు తెలిపారు. నిస్సహాయులకు సేవ చేసే అవకాశం ఈ రంగంలో ఉంటుందన్నారు.
బీజేపీలో చేరుతున్నా...
జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి తాను చేరుతున్నట్టు గంగోపాధ్యాయ్ తెలిపారు. బెంగాల్‌లో టీఎంసీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనను ఎక్కడి నుంచి పోటీ చేయమని బీజేపీ అధిష్టానం చెబితే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు.