Actor Vijay: అమిత్ షాపై హీరో విజయ్ ఫైర్
ABN , Publish Date - Dec 19 , 2024 | 10:05 AM
అంబేద్కర్ పేరు కొందరికి నచ్చదని తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా అంబేద్కర్ ను పూజిస్తారని ఆయన తెలిపారు.
చెన్నయి, డిసెంబర్ 19: పార్లమెంట్ వేదికగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేగింది. అమిత్ షా వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు నిరసన బాట పట్టాయి. అలాంటి వేళ అమిత్ షా వ్యాఖ్యలకు తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ గురువారం ఎక్స్ వేదికగా అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంత మందికి అంబేద్కర్ పేరు.. నచ్చదన్నారు. ఆయన పేరు అంటే వారికి అలర్జి అని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజకీయ నాయకుడని.. ఆయనకు సాటి లేరన్నారు. అంబేద్కర్ రాజకీయ మేధావి అని ఈ సందర్భంగా హీరో విజయ్ అభివర్ణించారు. స్వాతంత్ర దేశంలో స్వేచ్చ వాయువులు పీలుస్తున్న ప్రజలంతా ఆయన్ని ఎంతో గౌరవిస్తారన్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. “అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అంటూ ఆయన నామాన్ని మన హృదయాలతోపాటు పెదవులపై ఆనందంతో జపిస్తూనే ఉంటామని హీరో విజయ్ వివరించారు.
మరోవైపు.. బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు దాని భాగస్వామ్య పక్షాలు... నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. అయితే అమిత్ షా వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బండారాన్ని అమిత్ షా బహిర్గతం చేశరన్నారు. అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెర తీసిందని ఆయన ఆరోపించారు.
రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని ఇన్ని సార్లు భగవంతుడి పేరు తలచుకొంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై ఉభయ సభల్లోని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రిగా అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని మోదీ సమర్థించే ప్రయత్నం చేశారు. అందులోభాగంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో హోం మంత్రి అమిత్ షా బహిర్గతం చేశారంటూ ప్రధాని మోదీ వరుస ట్వీట్లతో వివరించారు. అందుకే హోం మంత్రి చెప్పిన వాస్తవాలు చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉల్కిపడిందన్నారు. అందులోభాగంగానే వారు సభలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిజం తెలుసునని ఈ సందర్భంగా మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేశారు.
మరోవైపు ప్రతిపక్షాల రాజీనామా డిమాండ్లపై అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్‌కు సంతోషాన్ని కలిగిస్తుందంటే.. తాను రాజీనామా చేస్తానన్నారు. కానీ ఇది ఎప్పటికీ సమస్యలను పరిష్కరించదన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతోన్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన కుర్చీలో కొనసాగాలని అమిత్ షా పేర్కొన్నారు.
ఇంకోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అధ్యక్షుడు, బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ స్పందించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. సభలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల టేప్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
For National news And Telugu News