నీట్ కౌన్సెలింగ్‌కు అర్హులందరినీ అనుమతించాలి
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:13 AM
స్థానికత వ్యవహారంలో అర్హులందరినీ నీట్ కౌన్సెలింగ్‌కు అనుతించాలని.. కేవలం హైకోర్టును ఆశ్రయించినవారినే కౌన్సెలింగ్‌కు అనుమతించడం సరికాదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికే కౌన్సెలింగ్ సరికాదు
విద్యార్థులకు న్యాయం చేయండి
స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు
విచారణ ఎల్లుండికి వాయిదా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానికత వ్యవహారంలో అర్హులందరినీ నీట్ కౌన్సెలింగ్‌కు అనుతించాలని.. కేవలం హైకోర్టును ఆశ్రయించినవారినే కౌన్సెలింగ్‌కు అనుమతించడం సరికాదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై గత తీర్పును సవరించి అర్హులైన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ సర్కారు జీవో నంబర్ 33 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నీట్‌కు ముందు నాలుగు సంవత్సరాలు స్థానికంగా చదవాలని ఆ జీవోలోని నిబంధన 3 (ఏ)లో స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహ అభిరామ్, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం.. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పు చెప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని తీర్పులో అభిప్రాయపడిన ధర్మాసనం.. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది.
వాటి మేరకు ప్రతి విద్యార్థికీ స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌పై.. సీజేఐ జస్టిస్‌ౖ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కిందటి శుక్రవారం విచారణ చేపట్టింది. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతో.. ఆ విషయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనితో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతోపాటు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అలాగే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్ మళ్లీ శుక్రవారం సీజేఐ చండ్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులతోపాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లన్నింటిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులనే కౌన్సెలింగ్‌కు అనుతించడం సరికాదని, అర్హులందరినీ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఆ తీర్పును సవరించాలంటే గతంలో తీర్పు ఇచ్చిన ధర్మాసనం మళ్లీ విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం.. జస్టిస్ పార్దీవాలా అందుబాటులో లేరని, అందుకే సోమవారం విచారణ చేపడతామని స్పష్టం చేశారు.