ఎన్నికల్లో ఏఐ హవా!
ABN , Publish Date - Apr 29 , 2024 | 06:20 AM
ఎండలు మండిపోతున్నాయి..! ప్రచారానికి సమయం లేదు..! ఓటర్లందరినీ కలిసేందు కు సుడిగాలి పర్యటనలకు చాన్సే లేదు..! సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా.. ఓటర్లు విసిగిపోయారు..! టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో యాడ్స్ ఇచ్చినా..
విరివిగా వాడుతున్న అభ్యర్థులు, పార్టీలు
అభ్యర్థుల తరఫున ఓటర్లకు ఏఐ ఫోన్ కాల్స్
ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఏఆర్ టెక్నాలజీ
దివంగత నేతలు కూడా ప్రజల ముందు ప్రత్యక్షం!
ఎండలు మండిపోతున్నాయి..! ప్రచారానికి సమయం లేదు..! ఓటర్లందరినీ కలిసేందు కు సుడిగాలి పర్యటనలకు చాన్సే లేదు..! సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా.. ఓటర్లు విసిగిపోయారు..! టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో యాడ్స్ ఇచ్చినా.. అవి తమ నియోజకవర్గ ఓటర్లందరికీ చేరుతాయా? అనే అనుమానం. దాంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు కృత్రిమ మేధ (ఏఐ), ఆగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్), ఇతర అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో దూసుకుపోతున్నారు.
నేరుగా ఓటర్లకు ఫోన్‌కాల్స్
గత ఎన్నికల వరకు అభ్యర్థుల ప్రచారం సోషల్ మీడియా పోస్టులతో దూసుకుపోయింది. ఈసారి వారు ఏఐ సాంకేతికతతో ఏకకాలంలో వందల మం ది ఓటర్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అభ్యర్థుల తరఫున ఏఐ.. ఓటర్లతో అభ్యర్థి మాటలను అనుకరిస్తూ(ధ్వన్యనుకరణ) మాట్లాడుతోంది. వారి సమస్యలను తెలుసుకుంటోంది. అభ్యర్థి పట్ల ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి కారణాలుచెబుతూ.. ఈసారి గెలిపిస్తే పక్కాగా పనులు చేస్తామంటూ హామీ ఇస్తోంది. ఫోన్లో అవతలివైపు ఉన్న ఓటరు మానసిక స్థితిని అంచనావేస్తూనే.. తనకే ఓటువేసేలా ఒప్పిస్తోంది. అజ్మీర్‌కు చెందిన ఏఐ ఆధారిత సంస్థ ‘పాలిమాథ్ సొల్యూషన్స్’ ఈ తరహా సేవలను ప్రారంభించింది. ఇలా ఎన్నికల ప్రచారంలో ఏఐని వినియోగించడంలో బీజేపీ ముందంజలో ఉంది.
ఇటీవల కాశీ తమిళ సం ఘం కార్యక్రమంలో ప్రధాని మోదీ హిందీ ప్రసంగం ఏకకాలంలో పలు భారతీయ భాషల్లో ఆయన గొంతుతోనే తర్జుమా అయింది. ఏఐ ఆధారిత సాంకేతికతతో అది సాధ్యమైంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఏఆర్ సాంకేతికత హవా ఊపందుకుంది. దీని వాడకం లో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే ముందంజలో ఉంది. ఆ పార్టీ దివంగత నేత కరుణానిధిని ఏఆర్ టెక్నాలజీతో ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను.. ఆయన పరిపాలనను ఏఆర్ టెక్నాలజీ ద్వారా కరుణానిధి పొగడ్తలతో ముంచెత్తే వీడియోలు ఇప్పుడు అక్కడి ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకే.. ఏఆర్ టెక్నాలజీని వాడుకునేంతలా పోటీ పెరగడం గమనార్హం..! అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత వీడియోలను ఆ పార్టీ ఏఆర్ ద్వారా ఓటర్ల ముందుకు తీసుకెళ్తోంది. ఇక పలు పార్టీలు తమ ముఖ్యనేతల ప్రసంగాల లింకులను క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ రూపంలో ఓటర్లకు అందజేస్తున్నాయి.
(సెంట్రల్ డెస్క్)
నాణేనికి మరో పార్శ్వం
ఏఐ, ఏఆర్ సాంకేతితతో ప్రయోజనాలున్నా కొన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రత్యర్థులపై దు ష్ప్రచారానికి వాడుతున్నాయి. డీప్‌ఫేక్ వీడియోలే ఇందుకు ఉదాహరణ. ఒక నాయకుడు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించేలా హావభావాలతో సహా ట్యాంపరింగ్‌చేయడమే డీప్‌ఫేక్. సదరు నేత గొంతుతో అదే పిచ్‌లో ఏమాత్రం తేడాలేకుండా వాయి్‌సను మార్చేస్తారు. ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని డీప్‌ఫేక్ చేసి..‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎత్తేస్తాం’’ అని ఆయన అన్నట్లుగా డీప్‌ఫేక్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈమేరకు ఈసీ కి ఫిర్యాదు చేసింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాని మోదీ వీడియోలనూ డీప్‌ఫేక్ చేశారనే ఆరోపణలు రావడం గమనార్హం..! రణ్‌వీర్ సింగ్ ఓ పార్టీకి మద్దతిస్తున్నట్లు వచ్చిన డీప్‌ఫేక్ వీడియోపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాకుండా..ఎక్స్‌లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రముఖ న్యూస్ చానళ్లలో వార్తలు వచ్చినట్లుగా ఆయా వార్తా సంస్థల లోగోలతో క్రియేట్ చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పారేస్తున్నాయి. దీంతో వివరణలు ఇచ్చుకోలేక ప్రత్యర్థిపార్టీలు తంటాలు పడుతున్నాయి.