Air India: ఎయిర్ ఇండియా చేసిన బ్లండర్‌కి కోటికి పైగా జరిమానా.. అసలేం జరిగిందంటే?
ABN , Publish Date - Jan 24 , 2024 | 04:15 PM
తమ కస్టమర్లకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించాల్సిన విమానయాన సంస్థలు అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి. ఓ ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను బేఖాతరు చేస్తుంటాయి. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి తప్పే చేసింది.
తమ కస్టమర్లకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించాల్సిన విమానయాన సంస్థలు అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి. ఓ ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను బేఖాతరు చేస్తుంటాయి. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి తప్పే చేసింది. దీంతో.. ఆ సంస్థకు కోటిన్నరకు పైగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోసారి ఇలాంటి బ్లండర్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ సంస్థకు హెచ్చరికలు అందాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగి ఒకరు ఈ ఎయిర్ ఇండియా సంస్థపై ఒక ఫిర్యాదు చేశారు. అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోసం తప్పనిసరి ఏర్పాట్లు లేకుండానే.. బోయింగ్ 777 విమానాన్ని యూఎస్‌కు నడిపిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన డీజీసీఏ (డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. ఆ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. కొన్ని సుదూర మార్గాల్లో నడిచే విమానాల్లో భద్రతా సంబంధిత నిబంధనలను ఎయిర్ ఇండియా ఉల్లంఘించినట్లు వెల్లడైంది. దీంతో.. ఎయిర్ ఇండియాపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆ ఎయిర్‌లైన్స్‌కు రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.
బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిబంధనలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని డీజీసీఏ తెలిపింది. తాము చర్యలు తీసుకోవడానికి ముందు ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అందుకు ఆ ఎయిర్‌లైన్స్ ఇచ్చిన సమాధానాన్ని డీజీసీఏ విశ్లేషించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ భద్రతా ఉల్లంఘన.. ఆ ఎయిర్‌లైన్స్ లీజుకు తీసుకున్న బోయింగ్ 777 విమానాలకు సంబంధించినదిగా స్పష్టం చేసింది. లీజుకు తీసుకున్న ఈ విమానాల నిర్వహణ పనితీరు పరిమితులకు అనుగుణంగా లేదని, అందుకే ఈ కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని డీజీసీఏ క్లారిటీ ఇచ్చింది.