Uttar Pradesh: అన్నొచ్చిండు! 15 ఏళ్ల తర్వాత కనౌజ్ నుంచి అఖిలేశ్ పోటీ
ABN , Publish Date - May 12 , 2024 | 03:09 AM
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.
గతంలో 3 సార్లు ఇక్కడ గెలిచిన ఎస్పీ చీఫ్
ఈసారి చివరి నిమిషంలో ఎన్నికల బరిలోకి
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఒకసారి, ఆయన కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వరుసగా మూడుసార్లు గెలిచారు. అఖిలేశ్ భార్య డింపుల్ రెండుసార్లు నెగ్గారు. గత ఎన్నికల్లో ఆమె.. బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడారు. 2009లో గెలిచిన అఖిలేశ్.. 2012లో యూపీ సీఎం కావడంతో రాజీనామా చేశారు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈసారి కనౌజ్ బరిలో నిలిచారు. సీఎంగా, ఎంపీగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వందకు పైగా కోల్డ్ స్టోరేజీలు, 400కు మించి అత్తరు లఘు పరిశ్రమలు, 23 ప్రైవేటు డిస్టిలరీలున్న కనౌజ్‌లో యువతకు ఉపాధి లేమి ప్రధాన సమస్య. ఇక్కడ 13న పోలింగ్ జరగనుంది.
‘ఇది ఇండియా-పాక్ ప్రపంచ కప్ మ్యాచ్’
కనౌజ్ ఎన్నికను అఖిలేశ్ వర్సెస్ పాఠక్, అఖిలేశ్ వర్సెస్ మోదీగా పేర్కొంటున్నారు. దీనిని మరింత వేడెక్కించేలా బీజేపీ సిటింగ్ ఎంపీ సుబ్రత్ పాఠక్ వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్‌తో పోటీని ఏకంగా ఇండియా-పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌గా అభివర్ణించారు. కాగా, సుబ్రత్‌పై 2014లో డింపుల్ 19,907 ఓట్లతో నెగ్గారు. ఆమెను సుబ్రత్ గత ఎన్నికల్లో 12,353 ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారీ ఎవరు గెలిచినా ఆధిక్యం మాత్రం స్వల్పమేనని అత్తరు వ్యాపారి ధీరేంద్ర మిశ్రా తెలిపారు.
ఎస్పీ, బీజేపీ మాత్రం లక్షన్నర నుంచి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొంటున్నాయి. కనౌజ్, ఔరయా, కాన్పూర్ దెహాత్ జిల్లాల్లో విస్తరించిన ఉన్న కనౌజ్ నియోజకవర్గంలో 19 లక్షల మంది ఓటర్లున్నారు. ముస్లింలు 3 లక్షలు, బ్రాహ్మణులు, యాదవులు 2.5 లక్షల చొప్పున ఉన్నారు. కానీ, 4 లక్షల పైగా ఉన్న దళితులే గెలుపు నిర్ణేతలు. అయితే, దళితుల పార్టీగా పేరుపడిన బీఎస్పీ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. దళితులు కులాన్ని బట్టి కాక, అభివృద్ధికి ఓటేయడమే దీనికి కారణం. బీఎస్పీ ఇమ్రాన్ బిన్ జాఫర్‌కు టికెటిచ్చింది. ఈయన ముస్లిం ఓట్లను చీల్చే చాన్సుంది. - సెంట్రల్ డెస్క్
అబ్బాయ్‌ని కాదని బాబాయ్..
కనౌజ్ టికెట్‌ను ఎస్పీ తొలుత ములాయం పెద్దన్న మనవడు తేజ్‌ప్రతాప్ సింగ్ యాదవ్‌కు కేటాయించింది. కానీ, చివరి నిమిషంలో అబ్బాయిని కాదని బాబాయ్ అఖిలేశ్ రంగంలోకి దిగారు. దీంతో ఎస్పీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ‘‘తేజ్‌ప్రతాప్ అయినా గెలిచేవారే. కానీ, కనౌజ్ అంటే భయ్యాజీ అఖిలేశే’’ అని సీనియర్ కార్యకర్త విజయ్‌సింగ్ యాదవ్ హర్షాతిరేకం వ్యక్తం చేశాడు. కాగా, కనౌజ్ వ్యాప్తంగా అఖిలేశ్‌ను అభిమానించే యువత కూడా అధికమే. ఈ నియోజకవర్గంలో అత్యధికులు నేతాజీగా పిలుచుకునే ములాయం కుటుంబంతో వ్యక్తిగత పరిచయం ఉన్నవారే. వీరిలో వీధి వ్యాపారుల నుంచి ఉన్నత వర్గాల వారి వరకు ఉండడం గమనార్హం.