Share News

Uttar Pradesh: మా సభకు అఖిలేశే రావాలి!

ABN , Publish Date - May 03 , 2024 | 03:52 AM

ఉత్తరప్రదేశ్‌ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్‌ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.

Uttar Pradesh: మా సభకు అఖిలేశే రావాలి!

ప్రియాంక రోడ్‌ షోలలో పాల్గొనాలి

  • కేజ్రీ సతీమణి వారాణసీలో పర్యటించాలి

  • యూపీలో కాంగ్రెస్‌ అభ్యర్థుల డిమాండ్‌

  • స్టార్‌ క్యాంపెయినర్లలో సీఎం రేవంత్‌

(సెంట్రల్‌ డెస్క్‌)

ఉత్తరప్రదేశ్‌ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్‌ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు. సోనియాగాంధీ రెండున్నర దశాబ్దాల పాటు యూపీ ఎంపీగా కొనసాగారు. రాహుల్‌గాంధీ అమేఠీ నుంచి మూడుసార్లు గెలిచారు. ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన హస్తం పార్టీ ప్రియాంక గాంధీకి రెండేళ్ల కిందటనే బాధ్యతలు అప్పగించింది కూడా.


కానీ, ఇప్పుడు యూపీ కాంగ్రెస్‌ అభ్యర్థులంతా తమ బహిరంగ సభలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హాజరు కావాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు రాహుల్‌, మరోవైపు ప్రియాంక ఉన్నప్పటికీ వారిలా కోరుతుండడం రాజకీయ పరిశీలకులను ఆశ్యర్యపరుస్తోంది. అయితే, ఈ ముగ్గురూ కలిసి పాల్గొంటే మరీ మంచిదని కొందరు పేర్కొంటున్నారు. అమ్రోహాలో రాహుల్‌, అఖిలేశ్‌ ఒకే సభలో పాల్గొన్న అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ప్రియాంక రోడ్‌ షోలకు అభ్యర్థులు పట్టుబడుతున్నారు.


కాగా, సీతాపూర్‌, దేవొరియాతో పాటు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారాణసీల్లో అఖిలేశ్‌ సభల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. మరోవైపు రాజకీయాల్లో కులానికి అధిక ప్రాధ్యానం ఇచ్చే యూపీలో తమతమ వర్గాలకు చెందిన నాయకులు ప్రచారంలో పాల్గొనాలని ఇంకొందరు అభ్యర్థులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోదీ తివారీని బ్రాహ్మణులు అధికంగా ఉన్నచోటకు, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ను లఖ్‌నవూ, సీతాపూర్‌ వంటి ఠాకూర్‌ ప్రాబల్య ప్రాంతానికి పంపాలని కోరుతున్నారు.


ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతతో వారాణసీలో ప్రచారం చేయించాలని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ రాయ్‌, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తలు యోచిస్తున్నారు. 2014లో వారాణసీలో మోదీపై కేజ్రీ పోటీకి దిగి 2 లక్షలపైగా ఓట్లు సాధించారు. ఈసారి మోదీపై అజయ్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్‌ 17 సీట్లలో పోటీచేస్తోంది. ఎస్పీ, ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు 63 స్థానాల్లో బరిలో దిగాయి. హస్తం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లుగా 40 మంది పేర్లను ప్రకటించింది. వీరిలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ సీఎంలు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, సుఖు ఉన్నారు. దశలవారీగా వీరు ప్రచారం చేస్తారు.

Updated Date - May 03 , 2024 | 03:52 AM