Share News

స్కూల్‌ టాయిలెట్‌లో చిన్నారులపై దారుణం

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:36 AM

అన్నెం పున్నెం ఎరుగని మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై పాఠశాల టాయిలెట్‌లో ఓ అంటెండెంట్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. వందలాది మంది తల్లిదండ్రులు, ప్రజలు దాదాపు ఎనిమిది గంటల పాటు థానే జిల్లా

స్కూల్‌ టాయిలెట్‌లో చిన్నారులపై దారుణం

పెల్లుబికిన జనాగ్రహం

మహారాష్ట్రను కుదిపేస్తున్న బద్లాపూర్‌ ఘటన

8 గంటల పాటు రైల్వే ట్రాక్‌పై ఆందోళన

నిందితుడిని ఉరి తీయాలంటూ నినాదాలు

ముంబై, ఆగస్టు 20: అన్నెం పున్నెం ఎరుగని మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై పాఠశాల టాయిలెట్‌లో ఓ అంటెండెంట్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. వందలాది మంది తల్లిదండ్రులు, ప్రజలు దాదాపు ఎనిమిది గంటల పాటు థానే జిల్లా బద్లాపూర్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలను అడ్డుకోవద్దని, రైల్వే ట్రాక్‌లను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా లెక్కచేయకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన నిందితుడిని ఉరి తీయాల్సిందేనంటూ నినదించారు. ‘హ్యాంగ్‌... హ్యాంగ్‌’ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ ఆందోళనతో అంబర్‌నాథ్‌-కర్జత్‌ సెక్షన్‌లో లోకల్‌ రైళ్లు నిలిచిపోయాయి. 15 దూర ప్రాంత రైళ్లను దారి మళ్లించారు. వారిని శాంతింపజేసేందుకు మధ్యాహ్నం మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులను తీసుకోవడంతో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశామని, నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిరసనకారుల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రైళ్లు రద్దవ్వడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పినా ఆందోళనను విరమించలేదు. సాయంత్రం నిరసనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ప్రతిగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఎట్టకేలకు 6.15 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌ను క్లియర్‌ చేయగలిగారు. దాదాపు పది గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైల్‌ రోకోకు దిగడానికి ముందు మహిళలతో సహా వందలాది మంది నిరసనకారులు ఆ పాఠశాల వద్దకు వెళ్లారు. కొందరు పాఠశాల గేట్లను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి.. తలుపులు, కిటికీలు, బెంచీలను విరగ్గొట్టారు.


బడిలో ఘోరం!

మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లోని ఓ పేరున్న పాఠశాలలో ఈ నెల 13న ఈ ఘోరం జరిగింది. పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్‌ షిండే అనే వ్యక్తి అక్కడ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత వారిలో ఓ చిన్నారి నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ చిన్నారి ప్రైవేటు భాగాలకు గాయమైనట్టు తెలిసింది. అలాగే మరో చిన్నారి బడికి వెళ్లడానికి భయపడుతుండడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఆ స్వీపర్‌ అఘాయిత్యం బయటపడింది. ఈ దారుణంపై ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 17న నిందితుడిని అరెస్టు చేసి, ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను, కొందరు సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. అయితే ఆ పాఠశాలలో మహిళా అటెండెంట్లు లేకపోవడమే కాదు.. సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో తేలింది. పాఠశాల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బందిని వదిలిపెట్టకూడదని పట్టుబడుతున్నారు. ఈ ఘటనపై మహిళా ఐపీఎస్‌ అధికారిణి ఆర్తి సింగ్‌ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. కేసు విచారణ వేగంగా జరిగేలా.. నిందితుడికి ఉరి శిక్ష పడేలా చూస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే హామీ ఇచ్చారు.

Updated Date - Aug 21 , 2024 | 05:36 AM