Share News

జాబిల్లిపై అతి పురాతన బిలం..!

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:58 AM

ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..

జాబిల్లిపై అతి పురాతన బిలం..!

  • ఇది 8.35 బిలియన్‌ ఏళ్ల క్రితం నాటిది

  • ల్యాండర్‌ దిగింది ఇక్కడే: శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై ఉన్న అతిపురాతన బిలంపై దిగి ఉండొచ్చని తెలిపారు. సుమారు 160 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ బిలం 8.35 బిలియన్‌ సంవత్సరాల క్రితంనాటి నెక్టేరియన్‌ కాలంలో ఏర్పడి ఉంటుందని, ఇది చంద్రుని చరిత్రలో అత్యంత పురాతనమైన కాలాల్లో ఒకటని అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ, ఇస్రో శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆ వివరాలను ఇకారస్‌ అనే సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.

‘చంద్రయాన్‌-3 దిగిన ప్రాంతం మరే ఇతర మిషన్లూ వెళ్లని ఒక ప్రత్యేకమైన భౌగోళిక వాతావరణంలో ఉంది. ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ పంపిన ఈ ప్రాంతానికి సంబంధించిన చిత్రాలు.. కాలక్రమేణా చంద్రుడు ఎలా పరిణామం చెందాడో వెల్లడిస్తాయి’ అని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో ప్లానెటరీ సైన్సెస్‌ డివిజన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ విజయన్‌ తెలిపారు. సాధారణంగా ఒక గ్రహాన్ని, లేదా చంద్రుడి వంటి భారీ ఉపరితలాన్ని గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు బిలం ఏర్పడుతుంది. అలా ఏర్పడిందే ఈ పురాతన బిలమని, విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇది ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - Sep 30 , 2024 | 04:58 AM