ఆర్మీ చీఫ్ కార్యాలయంలో చారిత్రక ‘1971’ చిత్రం తొలగింపు!
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:20 AM
ఆర్మీ చీఫ్ (సీవోఏఎస్) కార్యాలయంలో 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఉన్న ఫొటోను తొలగించడం వివాదం రేపింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 14: ఆర్మీ చీఫ్ (సీవోఏఎస్) కార్యాలయంలో 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఉన్న ఫొటోను తొలగించడం వివాదం రేపింది. సోమవారం విజయ్ దివస్ జరుపుకోనున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 1971, డిసెంబరు 16న బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భాగంగా యుద్ధం ముగింపు సందర్భంగా పాకిస్థానీ సైనిక బలగాల లొంగుబాటు పత్రంపై పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా సమక్షంలో సంతకం చేస్తున్న చిత్రాన్ని మార్చారు. దాని స్థానంలో ‘కర్మ క్షేత్ర’ అనే పేరుతో మరో చిత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో భారత్, చైనా సరిహద్దు ఎల్‌ఏసీ వెంబడి ఉండే ప్యాంగాంగ్ త్సో సరస్సు, యుద్ధ ట్యాంకర్లు, హెలికాప్టర్లు, సైనికులతో భారత యుద్ధ సామర్థ్యాలను చూపే చిత్రాలు ఉన్నాయి.