Share News

Army officer Kidnapped: మరో ఆర్మీ అధికారి కిడ్నాప్... ఇటీవల కాలంలో ఇది నాలుగవది

ABN , Publish Date - Mar 08 , 2024 | 06:50 PM

జాతుల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌ లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఇంటి నుంచి అగంతకులు ఆయనను అహపరించుకుని వెళ్లారు . గత మేలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి చోటుచేసుకున్న నాలుగో కిడ్నాప్ ఇది.

Army officer Kidnapped: మరో ఆర్మీ అధికారి కిడ్నాప్... ఇటీవల కాలంలో ఇది నాలుగవది

ఇంఫాల్: జాతుల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌ (Manipur)లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ (Kidnapped) అయ్యారు. ఇంటి నుంచి అగంతకులు ఆయనను అహపరించుకుని వెళ్లారు . గత మేలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి చోటుచేసుకున్న నాలుగో కిడ్నాప్ ఇది.


దౌబల్ జిల్లా నివాసి అయిన జూనియర్ కమిషన్డ్ అధికారు(జేసీఓ) కాన్సమ్ ఖేడ సింగ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అతని ఇంటి వద్ద నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో కిడ్నాప్ చేసినట్టు చెబుతున్నారు. కాగా, సమాచారం అందిన వెంటనే జేసీఓను కాపాడేందుకు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టామని, 102వ జాతీయ రహదారిపై అన్ని వాహనాలను తనిఖీ చేశామని భద్రతాధికారులు తెలిపారు. ఖేడ సింగ్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియలేదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు.


మే నుంచి 4వ ఘటన..

కాగా, 2023 మే నుంచి భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా సెలవులకు వెళ్లినప్పుడు కిడ్నాప్ కావడం ఇది నాలుగవది. గత సెప్టెంబర్‌లో మాజీ అసోం రెజిమెంట్ సోల్జర్ సెర్టో తాంగ్‌తాంగ్ కోమ్‌ను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఆయన ఇంఫాల్ వెస్ట్‌లో సెలవుపై ఇంటికి వెళ్లనప్పుడు ఈ ఘటన జరిగింది. దీనికి రెండు నెలల తర్వాత చురాచందర్‌పూర్ నుంచి లీమాక్హాంగ్‌కు 'సువ్'లో వెళ్తున్న నలుగురు వ్యక్తులను గుర్తుతెలియని సాయుధ దుండగులు అహరించుకు వెళ్లి కాల్చిచంపారు. వీరంతా జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ తరఫున పనిచేసిన ఓ సైనికుడి కుటుంబ సభ్యులు కావడం విశేషం. ఈ ఘటనలోనే ఐదో ప్రయాణికుడైన సోల్జర్ తండ్రి గాయపడి ఎట్టకేలకు తప్పగించుకుని బయటపడ్డారు. అతన్ని చికిత్సకోసం హెలికాప్టర్‌లో ఆర్మీ అధికారులు దిమాపూర్ తరలించారు. కాగా, ఫిబ్రవరి 27న ఇంఫాల్ సిటీ నుంచి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒకరిని సాయుధులు కిడ్నాప్ చేశారు. దీనికి నిరసనగా మణిపూర్ పోలీస్ కమెండోలు ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లో 'ఆర్మ్స్ డౌన్' నిరసన సైతం తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 07:36 PM