CM Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్ తాత్కాలిక బెయిల్ మంజూరు.. 5 షరతులు విధించిన కోర్టు
ABN , Publish Date - Jul 12 , 2024 | 06:48 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్ట్ శుక్రవారం మంజూరు చేసింది. మొత్తం 5 షరతులతో సుప్రీంకోర్ట్ బెయిల్ విధించింది. సీఎం కార్యాలయాన్ని సందర్శించడానికి వీల్లేదని, గవర్నర్ అనుమతి లేకుండా అధికారిక ఫైళ్లపై సంతకం చేయడానికి వీల్లేదని కోర్ట్ స్పష్టం చేసింది. బెయిల్ కోసం రూ.50,000 వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని పేర్కొంది.
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులలో ఎవరితోనూ మాట్లాడకూడదు లేదా కేసుతో సంబంధించిన ఫైల్స్ జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది. కాగా ఈ మధ్యంతర బెయిల్‌ను పొడిగించవచ్చు లేదా ఎక్కువ మంది సభ్యులతో కూడిన బెంచ్ రీకాల్ చేయవచ్చునని సుప్రీంకోర్ట్ పేర్కొంది. కాగా ఈడీ కేసులో బెయిల్ దొరికినప్పటికీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ బెయిల్ లభించడానికి కొన్ని గంటల ముందే ఇదే ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్ట్ పొడిగించింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.