Maliwal Assault row: స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ తొలి స్పందనిదే
ABN , Publish Date - May 22 , 2024 | 08:11 PM
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు బుధవారంనాడు పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి వ్యవహారంపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు మౌనం వీడారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు బుధవారంనాడు పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై 'రెండు వెర్షన్లు' వినిపిస్తున్నాయని, ఇరువైపు వాదనలపై పోలీసులు నిష్పాక్షిక విచారణ జరపాలని సూచించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నందున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం సరికాదన్నారు.
Election Commission: గాడితప్పుతున్న ప్రసంగాలపై ఈసీ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు
ముఖ్యమంత్రి నివాసంలో మే 3వ తేదీన సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పటకీ ఫిర్యాదు నమోదు చేయలేదు. కుమార్ తన ఛాతీ, పొత్తుకడుపుపై తన్నాడని, అమానవీయంగా లాక్కెళ్లారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత క్రమంలో కుమార్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, కుమార్ సైతం స్వాతి మలివాల్‌పై కేసు పెట్టడం, కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడం వంటి వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ నేతలు కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నిస్తూ, కేజ్రీవాల్ ద్వంద్వ ప్రమాణాలకు ఈ ఘటన అద్దంపడుతుందని విమర్శలకు దిగారు. దీనిపై ఆప్ సైతం ఘాటుగానే స్పందించింది. బీజేపీ కుట్రలో స్వాతి మలివాల్ పావుగా మారినట్టు ఆరోపించింది. కాగా, స్వాతి మలివాల్ మౌనాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తాము తప్పు చేయలేదని కేజ్రీవాల్ నిరూపించుకోవాలన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..