Share News

Independence Day: కేజ్రీవాల్ బదులుగా అతిషి జెండా ఎగురవేయలేరు.. జీఏడీ స్పష్టత

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:50 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది.

Independence Day: కేజ్రీవాల్ బదులుగా అతిషి  జెండా ఎగురవేయలేరు.. జీఏడీ స్పష్టత

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండా (National flag)ను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి (Atishi) జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిషి జెండా ఎగురవేయడానికి ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలనా విభాగం మంత్రి గోపాల్ రాయ్ అధికారులను సోమవారంనాడు ఆదేశించిన క్రమంలో జీఏడీ అదనపు ముఖ్య కార్యదర్శి నవీన్ కుమార్ చౌదరి తాజా వ్యాఖ్యలు చేశారు.


ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలులో ఉన్నందున ఆయన ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కావని నవీన్ కుమార్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఛత్రపాల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. సీఎం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నందున జెండా ఎగురవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశాయని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.


ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ ప్రభుత్వ స్వాంతంత్ర్య వేడుకల్లో తనకు బదులుగా జాతీయ పతాకాన్ని అతిషి ఎగురవేస్తారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ ఇంతకుముందు లేఖ రాశారు. అయితే తమకు ఈ ఈ మేరకు ఎలాంటి సమాచారం అందలేదని ఎల్జీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, జైలు నుంచి ఎల్జీకి కేజ్రీవాల్ లేఖరాయడం ఆయనకు కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేయడమేమని సీఎం చర్యను తీహార్ జైలు అధికారులు తప్పుపట్టారు.

Updated Date - Aug 13 , 2024 | 03:53 PM