Ram Mandir: రామ మందిర ఆహ్వానంపై వివాదం.. వారికి ఆచార్య సత్యేంద్ర స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Jan 01 , 2024 | 03:33 PM
జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతుండగా..
Ram Mandir: జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతుండగా.. మరోవైపు ఈ వేడుకకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించడంలో ఆలయ ట్రస్టు సిబ్బంది నిమగ్నమైంది. అయితే.. ఈ కార్యక్రమానికి తనకు ఇప్పటిదాకా ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే పేర్కొనడం కొత్త వివాదానికి దారితీసింది. రామ్ లల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, తనకు ఆహ్వానం అందకపోయినా ఈ ఆలయాన్ని సందర్శిస్తానని అన్నారు. అలాగే.. శ్రీరాముడు ఏ ఒక్క పార్టీ ఆస్తి కాదని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు.
ఈ విమర్శలకు తాజాగా రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీరాముడు భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయని, రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేయట్లేదని అన్నారు. ‘‘రాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేస్తారు. రాముడి పేరుపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని చెప్పడం ఏమాత్రం సరైంది కాదు. అలా చెప్పడం తప్పు. ప్రధాని నరేంద్ర మోదీ తన హయాంలో అపారమైన కృషి చేశారు. మన ప్రధానికి ప్రతి చోటా గౌరవం దక్కుతోంది. ఇది రాజకీయం కాదు, ఆయన భక్తి మాత్రమే’’ అని సత్యేంద్ర దాస్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. రాముడి పేరుతో ఎన్నికల్లో పోరాడేది వాళ్లేనని, రాజకీయాల్లోకి రాముడ్ని లాగి ఆయన్ను అవమానపరిచారని సత్యంద్ర దాస్ ధ్వజమెత్తారు.
ఇంతకీ ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలేంటి?
తనకు రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘రామ్ లల్లా వారికే కాదు, నాకూ చెందినవాడే. నేను వెళ్లాలనుకుంటే ఎప్పుడైనా వెళ్లొచ్చు. తలుచుకుంటే ఈరోజు లేదా రేపైనా వెళ్లొచ్చు. నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినప్పుడు అయోధ్యకు వెళ్లొచ్చాను. అంతకుముందు కూడా చాలాసార్లు అక్కడికి వెళ్లాను. నాకు ఆహ్వానం అందలేదన్న మాట నిజమే. అయినా నాకు ఆహ్వానం అవసరం లేదు. కానీ.. నేను ఒక అభ్యర్థన చేయదలచుకున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దు’’ అని చెప్పారు. ఇది ఒక రాజకీయ పార్టీ చుట్టూ తిరగకూడదని అన్నారు. ఇదే సమయంలో రామాలయం విషయంలో తన తండ్రి బాల్ థాకరే చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత రామాలయం ప్రారంభం కాబోతుండటం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
ఇక సంజయ్ రౌత్ ఏమన్నారంటే.. ‘‘ఈ ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుంది. ఈ రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం, ప్రభుత్వం తమ స్థావరాల్ని అయోధ్యకు మార్చుకోవాలి. తమ హయాంలో బీజేపీ మరే ఇతర పనులు చేయలేదు కాబట్టి.. రాముడి పేరుతో కచ్ఛితంగా ఓట్లు అడుగుతారు. ఎన్నికలకు ముందు రాముడ్ని అభ్యర్థిగా ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.