Ayodhya: ఇక నుంచి 'బాలక్ రామ్'గా దర్శనం ఇవ్వనున్న రామ్‌లల్లా
ABN , Publish Date - Jan 23 , 2024 | 06:15 PM
రామభక్తుల శతాబ్దాల కల సాకారమై అయోధ్యలోని భవ్య మందిరంలో సోమవారంనాడు కొలువైన రామ్‌లల్లాను ఇక నుంచి "బాలక్ రామ్''గా పిలువనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయోధ్య: రామభక్తుల శతాబ్దాల కల సాకారమై అయోధ్యలోని భవ్య మందిరంలో (Ayodhya Ram Mandir) సోమవారంనాడు కొలువైన రామ్‌లల్లాను ఇక నుంచి "బాలక్ రామ్'' (Balak Ram)గా పిలువనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ (Arun Dixit) ఈ విషయాన్ని వెల్లడించారు. అయోధ్యలో కొలువుతీరిన రామయ్య ఐదేళ్ల పసిబాలుడుగా దర్శనమిస్తున్నందున ఆయన పేరును 'బాలక్ రామ్'గా నిర్ణయించినట్టు చెప్పారు. ఆయన కొలువైన మందిరాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని తెలిపారు.
''తొలిసారి నేను విగ్రహం చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అప్పటి నా అనుభూతిని మాటల్లో చెప్పలేను'' అని ఇంతవరకూ తన జీవిత కాలంలో 50 నుంచి 60 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించిన వారణాసి పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటివరకూ తాను నిర్వహించిన విగ్రహ ప్రాణప్రతిష్టల్లో ఈ విగ్రహం అత్యంత అలౌకికమైన, అత్యున్నతమైనదిగా తనకు అనిపించిందని చెప్పారు. జనవరి 18న తాను తొలిసారి రామయ్య (బాలక్ రామ్) విగ్రహాన్ని చూసినట్టు చెప్పారు.