Share News

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: రామ్ లల్లా ఇక గుడారంలో కాదు.. మహా మందిరంలో ఉంటారు: ప్రధాని మోదీ

ABN , First Publish Date - Jan 22 , 2024 | 08:26 AM

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. వేలాది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవగా.. కోట్లాది జనులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారం అవడంతో అయోధ్య రామాలయం ప్రాంగణంతో పాటు.. యావత్ దేశ వ్యాప్తంగా జై శ్రీరాం నినాదం మార్మోగిపోయింది.

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: రామ్ లల్లా ఇక గుడారంలో కాదు.. మహా మందిరంలో ఉంటారు: ప్రధాని మోదీ
Ayodhya Ram Mandir Inauguration Live

Live News & Update

  • 2024-01-22T17:00:51+05:30

    రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకల్లో సీఎం కేజ్రీవాల్..

    అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. బందరాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులతో కలిసి పాల్గొన్నారు.

  • 2024-01-22T16:45:15+05:30

    రామకార్యం అంటే రాజ్య కార్యం ప్రజా కార్యం..

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య రామాలయం ముందు కూర్చుని ఫోటో దిగిన పవన్.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘రామకార్యం అంటే రాజ్య కార్యం ప్రజా కార్యం.. జై శ్రీ రామ్‘ అంటూ పోస్ట్ పెట్టారు పవన్.

  • 2024-01-22T16:15:28+05:30

    ఎన్నో జన్మల పుణ్యఫలం అయోధ్య రాముడి భవ్య మందిర దర్శనం: అనంత శ్రీరామ్

    అయోధ్య రాముని భవ్య మందిరాన్ని దర్శించుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. సోమవారం నాడు అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురష్కరించుకుని ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడులో రామ భక్తులు ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 500సంత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయపోరాటం, లక్షలాది రామ భక్తుల ప్రాణదానాలు, కరసేవకుల త్యాగాల ఫలితంగా నేడు ఆ శ్రీరాముడికి భవ్య రామ మందిరం నిర్మించుకున్నామన్నారు. ప్రభాత భానుడి కాంతులు విరజిమ్మే బాల రాముని విగ్రహా ప్రాణప్రతిష్ఠ అపురూప ఘట్టాన్ని రెండు కళ్ళతో దర్శించి సాక్షి భూతులమవ్వడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు అనంత శ్రీరామ్. మతాలకు, వర్ణాలకు, వర్గాలకు ఆతీతంగా రాముని సేవను చేసుకొని శ్రీరాముని జీవితాన్ని స్మరించుకోవాలని అనంత శ్రీరామ్ అన్నారు.

  • 2024-01-22T14:50:06+05:30

    న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు: ప్రధాని

    ‘రాముడి ఉనికిపై దశాబ్దాలుగా న్యాయ పోరాటం సాగింది. చివరకు న్యాయం చేసినందుకు భారత న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను‘ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • 2024-01-22T14:45:01+05:30

    శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నా..

    రాంలల్లా శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘సీతా సమేత రామచంద్ర స్వామికి జై. ఈరోజు మన రాముడు వచ్చాడు. 22 జనవరి 2024 నాటి ఈ సూర్యుడు కొత్త ప్రకాశాన్ని తెచ్చాడు. చాలా చెప్పాలనుకుంటున్నాను, అయితే గొంతు మూసుకుపోయింది. ఈ క్షణం అతీంద్రియమైనది. పవిత్రమైనది. శతాబ్దాల తపస్సు తర్వాత రాముడు తిరిగి వచ్చాడు. ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా మనం ఈ పని చేయలేకపోవడానికి మన కృషి, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. నేడు ఆ లోటు తీరింది. శ్రీ రాముడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ, ఈ క్షణం గురించి మాట్లాడతారు. మనమందరం ఈ క్షణాన్ని జీవిస్తున్నాము. ఈ కార్యక్రమం జరుగడం శ్రీరాముడి ఆశీర్వాద ఫలం. రామ్ లల్లా ఇకపై గుడారంలో ఉండరు. ఇకపై దివ్య మందిరంలో నివసిస్తారు. దేశంలో, ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న రామభక్తులకు ఇది సంతోషకరమైన రోజు అని విశ్వసిస్తున్నారు. ఈ క్షణం మనందరికీ శ్రీరాముడి ఆశీర్వాదం లభిస్తుంది.’ అని అన్నారు.

  • 2024-01-22T14:35:21+05:30

    అయోధ్యలో సెలబ్రిటీల ఆనందోత్సాహం..

    అయోధ్యలో సెలబ్రిటీల ఆనందోత్సాహంతో ఉన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ అద్భుత ఘట్టంలో పాల్గొన్న సందర్భంగా వారంతా కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

  • 2024-01-22T14:33:09+05:30

    శ్రీరాముడి కథ వింటే బాధలన్నీ తొలగిపోతాయి: మోహన్ భగవత్

    ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. "ఈ రోజు, 500 సంవత్సరాల తర్వాత, రామ్ లల్లా ఇక్కడకు తిరిగి వచ్చారు. ఆయన కృషి కారణంగా మనం ఇవాళ ఈ అద్భుతమైన రోజును చూస్తున్నాము. రాముడికి మనం అత్యంత గౌరవాన్ని ఇస్తాం.ఈ యుగపు చరిత్రలో చాలా శక్తి ఉంది. రామ్ లల్లా కథలు ఎవరు విన్నా వారి బాధలన్నీ తొలగిపోతాయి." అని చెప్పుకొచ్చారు.

  • 2024-01-22T14:30:31+05:30

    జనవరి 22, 2024 కొత్త కాలచక్రానికి మూలం..: మోదీ

    "జనవరి 22 సూర్యోదయం అద్భుతమైన శోభను తెచ్చిపెట్టింది. జనవరి 22, 2024 అనేది క్యాలెండర్‌పై ఉండే తేదీ కాదు. ఇది కొత్త కాలచక్రానికి మూలం"

  • 2024-01-22T14:23:35+05:30

    రామ్ లల్లా ఇక మహా మందిరంలో ఉంటారు..

    అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండరు. మహా మందిరంలో ఉంటారు.‘ అని పేర్కొన్నారు.

  • 2024-01-22T14:21:42+05:30

    భారత దేశ నాగరికత పునరుజ్జీవం పొందింది..

    అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా వేడుకలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ఆధ్యాత్మిక కోణంలో దేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూశారు. రామ మందిరంతో భారతదేశ సంస్కృతి, నాగరికత పునరుజ్జీవం పొందింది.‘ అని అన్నారు.

  • 2024-01-22T14:20:47+05:30

    ఇది రామ రాజ్యం..

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అయోధ్య వీధులు తుపాకీ కాల్పులతో ప్రతిధ్వనించవు. కర్ఫ్యూ ఉండదు. ఇక్కడ దీపోత్సవం, రామోత్సవాలు ఉంటాయి. శ్రీరాముడి పేరు 'సంకీర్తన' వీధుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇది రామ్ లల్లా రామరాజ్య ప్రకటన‘ అని అన్నారు.

  • 2024-01-22T14:00:53+05:30

    భావోద్వేగానికి గురైన ప్రముఖ సింగర్..

    అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సింగర్ అనురాధ పాడ్వల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘మాటలు రావడం లేదు. ఆ భగవంతుడు నిర్ణయించుకుంటే.. ఆయన రాకను ఎవరూ ఆపలేరు’ అని అన్నారు.

  • 2024-01-22T14:00:49+05:30

    అత్యంత సంతోషకరమైన రోజు..

    అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన తర్వాత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, "ప్రపంచ జనాభాలో ఆరవ వంతు మంది భారతదేశంలో నివసిస్తున్నారు. భారతదేశంలో ఏది జరిగినా అది ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. .. ఇది లక్షలాది మంది భక్తుల త్యాగం, కోట్లాది మంది విశ్వాసం యొక్క ఫలితం.. ఇది మా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు" అని పేర్కొన్నారు.

  • 2024-01-22T14:00:16+05:30

    ఉపవాస దీక్ష విరమించిన ప్రధాని మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్ష విరమించారు. అయోధ్య శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతం.. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ వేదికగా సాదువులు ప్రధాని మోదీచే ఉపవాస దీక్షను విరమింపజేశారు. తీర్థం తాగి దీక్ష విరమించారు ప్రధాని మోదీ.

  • 2024-01-22T13:52:23+05:30

    బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత..

    అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా.. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు విక్రమాదిత్య సింగ్ ఈ వేడుకకు హాజరయ్యారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు.

  • 2024-01-22T13:48:00+05:30

    మోహన్ భగవత్‌కు అయోధ్య రామ మందిరం ప్రతిమ..

    ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు అయోధ్య రామ మందిర ప్రతిమను బహుకరించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

  • 2024-01-22T13:45:02+05:30

    సామున్యులకు తొలి దర్శనం ఎప్పటి నుంచంటే..

    • ఐదు శతాబ్దాల వనవాసం వీడిన రాముడి దర్శనభాగ్యం సాక్షాత్కారమైంది.

    • సోమవారం నాడు అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.

    • నేడు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులు రామయ్యను దర్శించుకోగా.. మంగళవారం నుంచి సామాన్య భక్తులు దర్శించుకోనున్నారు.

  • 2024-01-22T13:30:11+05:30

    వజ్ర నామంతో దగదగ మెరిసిపోతున్న నీలమేఘశ్యాముడు

    యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తికగా ఎదురు చూసిన అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యింది. 12.29 నుంచి 12.30 నిమిషాల మధ్య అభిజిత్ లగ్నంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. 5 అడుగుల ఎత్తులో ఠీవీగా నిల్చుని.. ఎడమచేతిలో విల్లు, కుడి చేతిలో భాణం పట్టుకుని.. పడిసి కిరీటం, వజ్రాల నామం, స్వర్ణాభరణాలతో ధవళవర్ణ శిల్పశోభిత గర్భాలయంలో మెరిసిసోతున్నాడు నీలమేఘశ్యాముడు. అయోధ్యలో బాల రాముడి తొలి దర్శనం చూసి యావత్ ప్రపంచం పులకించిపోయింది. ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించారు భక్తకోటి జనం. భక్తుల సంబరాల మధ్య అయోధ్యలో త్రేతాయుగం అవిష్కృతమైనట్లుగా ఉంది. రామనామ స్మరణతో అయోధ్య మార్మోగిపోయింది. ఇక ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ప్రధాన ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు.

    గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో నిర్వహించిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన క్రతువులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ పాల్గొన్నారు. 83 సెకన్ల దివ్య ముహూర్తంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేయగా.. ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. రామయ్య చరణాలకు పద్మాలను సమర్పించి.. సాష్టాంగ నమస్కారం చేశారు.

  • 2024-01-22T13:00:42+05:30

    రామయ్యకు హారతి పట్టిన ప్రధాని మోదీ..

    శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ పూజలో భాగంగా రామయ్యకు హారతి పట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.

  • 2024-01-22T12:45:44+05:30

    రామయ్య దివ్య రూపం..

    500 ఏళ్ల తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్య ఆలయంలో కొలువుదీరారు. బాల రాముడి రూపంలో వజ్ర వైఢూర్యాలతో నిండు అలంకరణలో సుందర రూపుడై నిల్చుని ఉన్నారు.

  • 2024-01-22T12:45:13+05:30

    రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ..

    అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

  • 2024-01-22T12:43:07+05:30

    నిండు అలంకరణలో బాల రాముడు..

    నిండు అలంకరణలో బాల రాముడిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. సుందర రూపుతో, చిరు దరహాసం చిందిస్తూ మనోహరంగా నిలుచుని ఉన్నారు ఆ శ్రీరామచంద్రుడు. మనోహర రూపంతో కొలువుతీరిన రాములో పాదాల చెంత పద్మాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు పూజారులు.

  • 2024-01-22T12:37:35+05:30

    అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

    అయోధ్యలో అద్భుత ఘట్టం అవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు వేద పండితులు.

  • 2024-01-22T12:24:50+05:30

    అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని మీకోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక లైవ్ అందిస్తోంది. ప్రత్యక్ష ప్రసారం ఈ వీడియోలో చూడొచ్చు.

  • 2024-01-22T12:22:11+05:30

    ప్రారంభమైన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన పూజా క్రతువు

  • 2024-01-22T12:14:50+05:30

    రామాలయంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

    అయోధ్య రామాలయంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • 2024-01-22T12:08:07+05:30

    నేటి రామ లక్ష్మణులు మోదీ, యోగి అదిత్యనాథ్: సుమన్

    తెలుగు సినీ నటుడు సుమన్ అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఇద్దరు నేతలు నేటి కాలపు రామ లక్ష్మణులు అని పేర్కొన్నారు. ఆ భగవంతుడే వీరిచే రామాలయాన్ని నిర్మింపజేశారని పేర్కొన్నారు. భారత జాతి గర్వించదగ్గ సమయం ఇది అని పేర్కొన్నారు.

  • 2024-01-22T12:03:17+05:30

    భావోద్వేగానికి గురైన కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి

    బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి అయోధ్యకు చేరుకున్నారు. రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమ భావోద్వేగానికి గురయ్యారు. సాద్వి రితంబర, ఉమాభారతి ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.


  • 2024-01-22T12:00:41+05:30

    అయోధ్య రామాలయానికి చేరుకున్న సచిన్

    లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అయోధ్య రామాలయానికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • 2024-01-22T12:00:02+05:30

    ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠ పూజా క్రతువు..

    అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

  • 2024-01-22T11:52:45+05:30

    అయోధ్య రామాలయానికి అంబానీ కుటుంబం..

    అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • 2024-01-22T11:50:45+05:30

    రామాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయానికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

  • 2024-01-22T11:50:28+05:30

    జై సియా రామ్ పాటతో హోరెత్తిన అయోధ్య..

    జై సియా రామ్ పాటతో అయోధ్య రామాలయ ప్రాంగణం మారుమోగిపోయింది. సింగర్ సోనూ నిగమ్ ఈ పాటతో భక్తులను మంత్రముగ్దులను చేశారు.

  • 2024-01-22T11:47:55+05:30

    సీతారామచంద్రస్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు..

    అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా విశాఖలోని అంబికా బాగ్‌లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణం జరిపిస్తున్నారు.

  • 2024-01-22T11:45:58+05:30

    రామాలయం వద్ద శంకర్ మహదేవన్ పాట..

    అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ మహదేవన్.. రామ భజనతో ఆకట్టకున్నారు. ఈ పాటకు భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ శ్రీరాముడిని కీర్తించారు.

  • 2024-01-22T11:35:34+05:30

    నేపాల్: సర్వాంగ సుందరంగా ముస్తాబైన జానకీ టెంపుల్

    అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో నేపాల్‌లోని జానకీ మాత టెంపుల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీప కాంతులతో తళుక్కుమంటోంది ఆలయం ప్రాంగణం.

  • 2024-01-22T11:30:11+05:30

    రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్

    బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ అయోధ్యకు చేరుకన్నారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.


  • 2024-01-22T11:28:07+05:30

    అయోధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్

    అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సూపర్ రజనీకాంత్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అయోధ్యకు చేరుకున్నారు.

  • 2024-01-22T11:27:30+05:30

    అయోధ్యలో మెగాస్టార్ చిరంజీవి

    అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ పాల్గొన్నారు.

  • 2024-01-22T11:22:40+05:30

    ఈ భూమిపైనే అత్యంత అదృష్టవంతుడిని నేను: అరుణ్ యోగిరాజ్

    అయోధ్య రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి విగ్రహ రూప శిల్పి అరుణ్ యోగిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘నేను ఇప్పుడు ఈ భూమిపైనే అత్యంత అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు ఇది నిజమేనా అనిపిస్తుంటుంది.’ అని చెప్పుకొచ్చారు.

  • 2024-01-22T11:15:12+05:30

    అయోధ్యకు చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

    అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 2024-01-22T10:30:00+05:30

    రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, గాయకుడు సోనూ నిగమ్ అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ ఇది అద్భుతమని, మ్యాజికల్ మూమెంట్ అని చెప్పారు.

  • 2024-01-22T10:15:00+05:30

    రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి అయోధ్యకు వస్తున్న అతిథులందరికీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు.

  • 2024-01-22T10:01:32+05:30

    అయోధ్య ప్రాణప్రతిష్ఠ దివ్య ముహూర్తం 84 సెకండ్లపాటు కొనసాగనుంది. మధ్యాహ్నం 12:29:03 గంటల నుంచి 12:30:35 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.

  • 2024-01-22T10:00:00+05:30

    క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్, గౌతం గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హర్మన్ ప్రీత్ కౌర్‌, నీరజ్ చోప్రా, విశ్వనాథన్ ఆనంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపిచంద్, పీటీ ఉష, లియాండర్ పేస్, కరణం మల్లేశ్వరి, కళ్యాణ్ చౌబే, దేవేంద ఝంజడ్లా, భైచుంగ్ భూటియా, బచేంద్రి పాల్, ప్రకాష్ పదుకొనేకు రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

  • 2024-01-22T09:41:26+05:30

  • 2024-01-22T09:33:19+05:30

    బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఎల్‌కే అద్వానీ ప్రస్తుత వయసు 96 సంవత్సరాలు.

  • 2024-01-22T09:23:53+05:30

    అయోధ్య బయలుదేరిన బాలీవుడ్ సెలబ్రిటీలు. అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నిర్మాత రోహిత్ శెట్టి, జాకీ ష్రోఫ్, మాధురీ దీక్షిత్, ఫిల్మ్‌మేకర్ రాజ్‌కుమార్ హిరానీతో పాటు పలువురు సెలబ్రిటీలు సాంప్రదాయ దుస్తులు ధరించి అయోధ్యకు బయలుదేరారు.

    Untitled-9.jpg

  • 2024-01-22T09:09:51+05:30

    వేర్వేరు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన 114 కలశాల పుణ్యజలంతో రామ్‌లల్లా విగ్రహానికి అభిషేకం చేసిన పూజారులు.

    Untitled-8.jpg

  • 2024-01-22T09:03:59+05:30

    అయోధ్య చేరుకున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు. ప్రయాణంలో ఆయన వెంట టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

  • 2024-01-22T08:53:46+05:30

    అమెరికాలోని ఆరిజోనాలో రామనామ స్మరణ

    Untitled-7.jpg

    Untitled-6.jpg

  • 2024-01-22T08:43:40+05:30

    అయోధ్యకు చేరుకుంటున్న విశిష్ఠ అతిథులు..

    ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా వీఐపీలు, వీవీఐపీలు అయోధ్యకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చేరుకున్నారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినవారిలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు.

  • 2024-01-22T08:23:51+05:30

    ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’’ అంటూ రామభక్తులంతా ఆ బాల రాముని దర్శనం కోసం తపిస్తున్న సమయం ఆసన్నమైంది! అల సాకేతపురిలో జన్మించి.. సరయూ నది ఒడ్డున ఆటలాడి.. తండ్రిమాట జవదాటని పితృవాక్య పరిపాలకుడిగా ఎదిగి.. హిందూ జన హృదయ సామ్రాట్టుగా విరాజిల్లుతున్న ఆదర్శపురుషుడు, అవతారమూర్తి ప్రాణప్రతిష్ఠ సుముహూర్తానికి ఇంకా కొన్ని గంటలే ఉంది! బాల రాముడి నేత్రోన్మీలనాన్ని తిలకించి పులకించే క్షణాలు దగ్గరికొచ్చేశాయి! మరపురాని ఈ వేడుకలను కనులారా వీక్షించేందుకు.. సంబరాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుని ఆ జ్ఞాపకాలను మనసుపొరల్లో దాచుకునేందుకు.. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్యాపుర వీధులన్నీ నిండిపోయాయి! లౌడ్‌ స్పీకర్లలో వినిపించే రాముడి పాటలతో.. రామయ్య భజనలతో మారుమోగుతున్నాయి!! రెపరెపలాడుతూ ఎగిరే రామ ధ్వజాలతో.. రామనామ సంకీర్తన చేసే సాధుసంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందడి నడుమ.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పుసుపు వస్త్రాన్ని తొలగించి (నేత్రోన్మీలనం అనంతరం) తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. కాగా.. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రామ్‌లల్లాకు ముందుగా నివేదించే 56 రకాల భోగ్‌ ప్రసాదం ఇప్పటికే లఖ్‌నవూ నుంచి అయోధ్యకు చేరుకుంది.

    50 వాయిద్యాలతో మంగళ ధ్వనులు

    రామమందిరం ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు 2 గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి. దీనికోసం భారతీయ సంప్రదాయానికి చెందిన ఘటం (ఏపీ), మృదంగం, నాదస్వరం (తమిళనాడు), వీణ (కర్ణాటక) తదితర 50 రకాల సంప్రదాయ సంగీత వాయిద్యాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

    కొత్త ఆలయంలోకి రామ్‌లల్లా

    దాదాపు 70 సంవత్సరాల పాటు ఒక గుడారానికి పరిమితమై అక్కడే పూజలందుకుంటున్న పాత రామ్‌ లల్లా... 21న రాత్రి శయన హారతి అనంతరం 22న సోమవారం కొత్త ఆలయంలో నిద్ర లేవనున్నారు. ఆదివారం రాత్రి హారతి తర్వాత పాత విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన రామమందిరంలోకి తరలించారు. అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, స్వామి హనుమ విగ్రహాలను కొత్త ఆలయంలోకి తీసుకెళ్లారు. దశాబ్దాల అనంతరం ఈ నెల 20, 21వ తేదీల్లో పాత ఆలయం మూసి ఉండటంతో భక్తులకు వరుసగా రెండు రోజుల పాటు రామ్‌ లల్లా దర్శనం లభించలేదు. ఇప్పుడు వారందరికీ ఆయన కొత్త మందిరంలో దర్శన భాగ్యం కలిగించనున్నారు. కొత్తగా ప్రతిష్ఠించే బాల రాముడి విగ్రహం ముందు భాగంలోనే.. ఈ విగ్రహాలను కూడా ఉంచుతారు. రామ్‌లల్లా పాత విగ్రహం ఎత్తు కేవలం ఆరు అంగుళాలు మాత్రమే కాగా, మిగిలిన విగ్రహాలు అంతకంటే చిన్నవి. ఈ నేపథ్యంలోనే.. పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాలని ట్రస్టు నిర్ణయించింది.

    10 లక్షల దీపాలు.. 121 మంది ఆచార్యులు..

    బాల రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం (22న) సాయంత్రం అయోధ్య నగరాన్ని 10లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. నగరంలోని 100 ఆలయాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్లను దీపాలతో అలంకరిస్తామని ట్రస్టు అధికారులు వెల్లడించారు. ఇక.. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా క్రతువుల్లో 121మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. కాగా.. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిర నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. పాత రామ్‌లల్లా విగ్రహం ఐదారు అంగుళాలు మాత్రమే ఎత్తు ఉండటంతో 25-30 అడుగుల దూరం నుంచి దర్శించుకోవడానికి భక్తులకు సాధ్యం కాదని.. అందుకే పెద్ద విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని ఆయన వివరించారు.