Ayodhya Ram Temple: అయోధ్యకు తిరిగొస్తున్న రామన్న.. భక్తుల అనుభవాలను పోస్ట్ చేయాలని కోరిన ట్రస్టు
ABN , Publish Date - Jan 16 , 2024 | 06:56 PM
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట ఈనెల 22న జరుగనున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఈ ఉత్సవ శోభను మరింత పెంచుతూ భక్తులు తమతమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని మంగళవారంనాడు కోరింది.
అయోధ్య: శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువుతీరనున్న మధుర క్షణాల కోసం యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శతాబ్దాల నిరీక్షణకు తెరపడి..ఇన్నేళ్లకు తమ కలలు నెరవేరనున్నాయంటూ భక్తులు రామ భజనలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణతో పులకించిపోతుండగా, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలకు తెరలేచింది. ఈనెల 21వ తేదీ వరకూ జరిగే ఈ ఉత్సవాలు 22వ తేదీన ఆలయ గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో పతాక స్థాయికి చేరుకోనున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఈ ఉత్సవ శోభను మరింత పెంచుతూ భక్తులు తమతమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని మంగళవారంనాడు కోరింది.
''చారిత్రక ఘట్టం ఆవిష్కరణ కానున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తమ ఆలోచనలు, భావోద్వేగాలను ఒక చిన్న వీడియో ద్వారా అన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. పూర్తి పేరు, ప్రాంతం, సంక్షిప్తంగా తమ ఆలోచనలను సామాజిక మాధ్యమాల్లో #ShriRamHomecomingతో పోస్ట్ చేయండి'' అని టెంపుల్ ట్రస్టు కోరింది. 500 ఏళ్ల తర్వాత రాముడు తన స్వస్థలమైన అయోధ్యకు తిరిగి వస్తుండటంతో విశ్వవ్యాప్తంగా భావోద్వోగాలు ఉప్పొంగుతున్నాయనీ, భక్తులు ఈ అనుభవాలను సంక్షిప్త వీడియోల రూపంలో పంచుకోవాలని, కలిసికట్టుగా ఈ ఉత్సవాల్లో పాల్గొందామని ట్రస్టు పిలుపునిచ్చింది.