Plane Crash: రష్యా కాల్పుల వల్లే విమానం కూలిపోయిందా?
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:32 AM
అజర్‌బైజాన్ విమానం కూలిపోవడానికి పక్షుల గుంపును ఢీకొనడం కారణం కాదా? ఉక్రెయిన్ డ్రోన్ అని భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

వెనుక భాగంలో తూటాలు దూసుకెళ్లినట్లు రంధ్రాలు
మాస్కో, డిసెంబరు 26: అజర్‌బైజాన్ విమానం కూలిపోవడానికి పక్షుల గుంపును ఢీకొనడం కారణం కాదా? ఉక్రెయిన్ డ్రోన్ అని భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. విమానం వెనుక భాగంలో కనిపిస్తున్న రంధ్రాలు తూటాలు దూసుకెళ్లడంవల్ల పడినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం కూలిపోవడానికి ముందు లోపల ఒకరు తీసిన వీడియోలో ఓ మహిళ కాలికి గాయమైన దృశ్యాలు, క్యాబిన్ వాల్‌పై కనిపించిన రంధ్రాలు కూడా ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. అజర్‌బైజాన్ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. కాగా, రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
దర్యాప్తు పూర్తయితే అసలు కారణాలు తెలుస్తాయని, అప్పటి వరకు ఓపిక పట్టాలని క్రెమ్లిన్ ప్రతినిధి సూచించారు. బుధవారం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆ దేశ రాజధాని బాకూ నుంచి రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళుతుండగా కజికిస్థాన్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 38 మంది ప్రయాణికులు మరణించారు. మిగతా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం పక్షులను ఢీకొట్టిన తర్వాత అత్యవరసర పరిస్థితి తలెత్తిందని, దాంతో కజికిస్థాన్‌లోని ఆక్టౌ విమానాశ్రయంలో దింపే యత్నంలో కూలిపోయిందనేది ప్రాథమిక సమాచారం.