Share News

Bajaj Electronics : గ్యాస్‌ బైక్‌ వచ్చేసింది!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:24 AM

ఇప్పటిదాకా మనం గ్యాస్‌తో నడిచే కార్లను మాత్రమే చూశాం. ఇకపై గ్యాస్‌తో నడిచే బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. బజాజ్‌ ఆటో సంస్థ ఈ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది.

Bajaj Electronics : గ్యాస్‌ బైక్‌ వచ్చేసింది!

  • ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసిన బజాజ్‌ ఆటో

  • ‘ఫ్రీడమ్‌ 125’ పేరుతో మార్కెట్లోకి

  • 2 కిలోల గ్యాస్‌, 2 లీటర్ల పెట్రోల్‌తో 330 కి.మీ. ప్రయాణించొచ్చు

  • కి.మీ.కి దాదాపు రూపాయి ఖర్చు

  • బజాజ్‌ నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌

పుణె, జూలై 5: ఇప్పటిదాకా మనం గ్యాస్‌తో నడిచే కార్లను మాత్రమే చూశాం. ఇకపై గ్యాస్‌తో నడిచే బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. బజాజ్‌ ఆటో సంస్థ ఈ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది. ప్రపంచంలోని మొట్టమొదటి సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) బైక్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్‌ 125 పేరిట దీనిని ఆవిష్కరించింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ ఈ వాహనాన్ని పుణెలోని కంపెనీ ప్లాంట్‌లో ఆవిష్కరించారు. గ్యాస్‌తోపాటు పెట్రోల్‌తో కూడా నడిచేలా రెండు ఆప్షన్లతో కూడిన ట్యాంక్‌తో ఈ బైక్‌ను రూపొందించారు. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.95 వేల నుంచి ఉంటుంది.

మూడు వేరియంట్లతో దీనిని మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డిస్క్‌ ఎల్‌ఈడీ, డ్రమ్‌ ఎల్‌ఈడీ, డ్రమ్‌ వేరియంట్లలో ఫ్రీడమ్‌ 125 బైక్‌ లభిస్తుంది. డిస్క్‌ ఎల్‌ఈడీ బైక్‌లు ఐదు రంగుల్లో, నాన్‌ ఎల్‌ఈడీ డ్రమ్‌ వేరియంట్‌ బైక్‌ రెండు రంగుల్లోనూ లభిస్తాయి. డ్రమ్‌ వేరియంట్‌ బైక్‌ ధరను రూ.95 వేలుగా నిర్ణయించగా, డ్రమ్‌ ఎల్‌ఈడీ బైక్‌ ధర రూ.1.05 లక్షలు, డిస్క్‌ ఎల్‌ఈడీ బైక్‌ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు.


ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఫ్రీడమ్‌ 125 బైక్‌లో 2 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్‌ ట్యాంక్‌, 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్‌ ఉంటాయి. 2 కిలోల సీఎన్‌జీతో 200 కిలోమీటర్ల దూరం, 2 లీటర్ల పెట్రోల్‌తో 130 కిలోమీటర్ల దూరం కలిపి మొత్తం 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బైక్‌ రన్నింగ్‌లో ఉండగానే గ్యాస్‌ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్‌ నుంచి గ్యాస్‌కు మార్చుకునే స్విచ్‌ ఏర్పాటు కూడా ఉంటుంది. ఆవిష్కరణ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సాధారణ పెట్రోల్‌ బైక్‌ల సగటు వ్యయం కిలోమీటరుకు రూ.2.25 అవుతుందని, కానీ.. సీఎన్‌జీ బైక్‌తో ఈ ఖర్చు కిలోమీటరుకు రూ.1కి తగ్గనుందని అన్నారు. ముడి చమురును దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే అవకాశం ఫ్రీడమ్‌ 125 బైక్‌ ద్వారా కలుగుతుందన్నారు.

ఫ్రీడమ్‌ 125 బైక్‌ను తొలుత మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి తేనున్నట్లు.. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విక్రయించనున్నట్లు బజాజ్‌ ఆటో కంపెనీ తెలిపింది. బజాజ్‌ షోరూమ్‌లతో పాటు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ వాహనాన్ని బుక్‌ చేసుకోవచ్చునని పేర్కొంది.

Updated Date - Jul 06 , 2024 | 04:24 AM