Share News

Bangalore: దే‘ముడా’..! సీఎం మెడకు చుట్టుకున్న ముడా వ్యవహారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:13 PM

‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.

Bangalore: దే‘ముడా’..! సీఎం మెడకు చుట్టుకున్న ముడా వ్యవహారం

- స్థలాల వాపసుతో మరింత జఠిలం

- సిద్దూపై ప్రతిపక్షాల ధ్వజం

- సీఎం పూర్తిగా ఇరుక్కున్నారు: మాజీ సీఎం బొమ్మై

- నేను హిట్‌ అండ్‌ రన్‌ అయితే.. సిద్దూ యూటర్న్‌: కేంద్రమంత్రి కుమారస్వామి

- నా భార్య వద్దన్నారు.. కమిషనర్‌ రద్దు చేశారు

- బీజేపీ, జేడీఎస్‌ కుట్రలకు బెదరను..

- ఆత్మసాక్షితో పనిచేస్తా.. రాజీనామా ప్రసక్తే లేదు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు: ‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్దరామయ్యపై ఇంటి స్థలాల వివాదంలో లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, అంతలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జోక్యం చేసుకోవడంతో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. ‘నా భర్త సీఎం సిద్దరామయ్య 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఎక్కడా అవినీతి మరక లేకుండా నైతికతతో వ్యవహరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?


రాజకీయాలతోపాటు ప్రజాజీవనంలో ఆయనకు భంగం కలగరాదనే నిర్ణయానికి వచ్చాను, నేనెప్పుడూ ఇళ్లు, ఆస్తి, బంగారం కోరుకోలేదు, నా కారణంగా ఆయన రాజకీయ జీవనంలో చిన్న తప్పును కూడా సహించలేను’ పేర్కొన్నారు. తన పసుపు కుంకుమగా వచ్చిన భూమి ద్వారా దక్కిన 14 ఇంటి స్థలాలను వాపసు చేయాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని తన భర్తతో కూడా చర్చించలేదని, ఇది తన ఆత్మసాక్షికి సంబంధించిన తీర్మానమని పేర్కొన్నారు. లేఖను కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య ముడా కమిషనర్‌ రఘునందన్‌కు అందించారు. మంగళవారం మధ్యాహ్నం లేఖ అందిందని పరిశీలిస్తున్నామని వెల్లడించిన కమిషనర్‌ రాత్రి తన నిర్ణయాన్ని ప్రకటించారు. సిద్దరామయ్య భార్య పార్వతి పేరిట ఉన్న 14 ఇంటి స్థలాల క్రయ, విక్రయాలను ఖాతాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోనే అసలు వ్యవహారం మొదలయ్యింది. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.


నా భార్య రద్దు కోరితే... నేరం ఒప్పుకున్నట్లా..?: సీఎం

నా భార్య ఇంటిస్థలాలను రద్దు చేయాలని కోరితే నేరం ఒప్పుకున్నట్లు అవుతుందా..? అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన భార్య నిర్ణయం తనకే తెలియదని, ఆమెకు పసుపు - కుంకుమల కింద సోదరుడు మల్లికార్జునస్వామి 3.16 ఎకరాల భూమిని ఇచ్చారని అది ముడా స్వాధీనం చేసుకుందన్నారు. ఇందుకు పరిహారంగా ఇచ్చిన 14 ఇంటి స్థలాల ద్వారా తన ప్రజా జీవనానికి ఇబ్బంది కలుగుతోందని రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. ముడా వివాదంలో మనీలాండరింగ్‌ జరగలేదని అయినా ఈడీ ఎందుకు జోక్యం చేసుకుందో తెలియదన్నారు. బీజేపీ, జేడీఎస్‌ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాజీనామా చేసేది లేదని, ఆత్మసాక్షితో పనిచేస్తానన్నారు.


వాపసు ఇచ్చి ఇరుక్కున్నారు: మాజీ సీఎం బొమ్మై

ఇంటి స్థలాలు వాపసు చేయడం ద్వారా సీఎం సిద్దరామయ్య వివాదాన్ని మరింత జఠిలం చేసుకున్నారని మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు. హుబ్బళ్ళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముడా నుంచి ఇంటి స్థలాలు పొంది విధానసౌధలోనే వాపసు చేసి హైకోర్టులో విచారణకు అంగీకరించి ఉంటే ఆయనకు గౌరవం ఉండేదన్నారు. గవర్నర్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చాక, హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చిన తర్వాత లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, ఈడీ జోక్యం చేసుకున్న క్లిష్ట పరిస్థితుల్లో స్థలాలు వాపసు చేస్తే విచారణలు ఆగుతాయా..? అని ప్రశ్నించారు. న్యాయపోరాటం చేస్తానని సవాల్‌ విసిరిన సీఎం ఎందుకు వెనక్కు తగ్గారన్నారు.


నా వ్యాఖ్యలను హిట్‌ అండ్‌ రన్‌ అని అంటే సిద్దరామయ్య యూటర్న్‌ కాదా..? అంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. సిద్దరామయ్య భార్య నాకు సోదరి లాంటిదన్నారు. ఇంటి స్థలాల వాపసు ఇప్పుడు తీసుకునే నిర్ణయం కాదని వివాదం తలెత్తిన రోజే వాపసు చేసి ఉంటే బాగుండేదన్నారు. సిద్దరామయ్య భార్య పట్ల చులకనగా మాట్లాడేది లేదన్నారు. అయితే నా భర్త పిల్లలకు తెలియకుండానే స్థలాలు వాపసు చేస్తున్నానని లేఖ రాయడాన్ని ఎలా నమ్మాలన్నారు. గతంలో సిద్దరామయ్య హుబ్లాట్‌ వాచ్‌ ధరించినప్పుడు వివాదం తారస్థాయికి చేరినప్పుడు వాపసు చేశారని, ముడా వివాదంలోనూ అదే జరిగిందన్నారు. ఇంటి స్థలాలు వాపసు చేస్తే కేసునుంచి తప్పించుకోవడం సాధ్యమా..? అన్నారు. తప్పు జరిగిందంటే దొంగలను పోలీసులు వదిలేస్తారా..? అని కుమార ప్రశ్నించారు.


18మందిపై ఈసీఐఆర్‌

ముడా వివాదంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోక్యం చేసుకున్న తర్వాత 18 అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) నమోదు చేసింది. సోమవారం ఈడీ అధికారులు సీఎం, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున, భూయజమాని దేవరాజ్‌పై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆ వెంటనే 18మంది అధికారులపై ఈసీఐఆర్‌ నమోదు చేశారు.


ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

ఇదికూడా చదవండి: రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 01:13 PM