Bangalore: ఆ ముగ్గురు మంత్రుల మంతనాల మర్మమేమిటో.. సిద్దూ ప్రభుత్వాని పొంచిఉన్న ముప్పు?
ABN , Publish Date - Jan 06 , 2024 | 10:55 AM
రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని చెప్పలేని పరిస్థితులు వెంటాడుతున్నాయి.
- సతీష్ జార్కిహోళి నివాసంలో పరమేశ్వర్, మహదేవప్ప భేటీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని చెప్పలేని పరిస్థితులు వెంటాడుతున్నాయి. రాష్ట్ర కేబినెట్‌లో సీనియర్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ముంత్రులు రహస్య భేటీ సర్వత్రా చర్చకు దారితీస్తోంది. సదాశివనగర్‌లోని ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి(Minister Satish Jarkiholi) నివాసంలో గురువారం హోంశాఖ మంత్రి పరమేశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప కలిశారు. ముగ్గురు మంత్రులు మినహా ఎవరూ లేరని సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొనేందుకు సీఎం సిద్దరామయ్య, డీసీఎం పరమేశ్వర్ వెళ్ళిన సందర్భంలోనే వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికి కేబినెట్‌లో డీకే శివకుమార్(DK Shivakumar) ఒక్కరు మాత్రమే డీసీఎంగా ఉన్నారు. తమకు డీసీఎం హోదా కావాలని ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పరమేశ్వర్, సతీష్ జార్కిహోళి డిమాండ్ చేస్తున్నారు. సతీష్ జార్కిహోళి ఏకంగా శివకుమార్‌కు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలా సాగుతుండగానే ముగ్గురు సీనియర్ మంత్రుల కలయిక సర్వత్రా చర్చనీయాంశమయింది. కొన్నిరోజుల కిందట మంత్రి పరమేశ్వర్ ఇంట్లో ముగ్గురు మంత్రుల సమావేశం జరిగింది.
తాజాగా మరోసారి కలవ డం వెనుక భారీగానే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలలోగానే కనీసం మరో రెండు డీసీఎం పదవు లు సాధించే దిశగానే వీరి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీకే శివకుమార్ ఒక్కరే డీసీఎంగా ఉన్నందున ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఉందని, అదే మరో ఇద్దరు ఉంటే సరిపోతుందనే వ్యూహం కూడా ఉన్నట్లు సమాచారం. మహదేవప్ప సుదీర్ఘకాలంగా సీఎం సిద్దరామయ్యకు ఆప్తుడనేది తెలిసిందే. సతీష్ జార్కిహోళి ఇప్పటికే డీకే శివకుమార్ తీరుపట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇక పరమేశ్వర్ తటస్థంగానే ఉన్నా ప్రస్తుతం సిద్దరామయ్య వైపు వెళితేనే డీసీఎం పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు లోక్‌సభ ఎన్నికల కోసం కీలక నేతలు తీవ్రమైన ప్రయత్నాలు సాగిస్తుండగా ముగ్గురు మంత్రుల రహస్య సమావేశాలు సంచలనం కలిగిస్తున్నాయి.