Beraktar TB2 Drones : బోర్డర్‌లో బంగ్లాదేశ్ కవ్వింపు
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:14 AM
సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో అత్యాధునిక బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మొహరించింది.
సరిహద్దులో కిల్లర్ డ్రోన్లను మొహరించిన పొరుగుదేశం
అప్రమత్తమైన భారత్.. నిఘా పెంపు
న్యూఢిల్లీ, డిసెంబరు 6: సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో అత్యాధునిక బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మొహరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ సరిహద్దులో నిఘా పెంచింది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత సరిహద్దు వెంట ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయనే ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆ డ్రోన్లను మొహరించినట్లు బంగ్లాదేశ్ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, మన సరిహద్దుల భద్రత, రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నామని సీనియర్ రక్షణ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు భారత నిఘా వర్గాలు కూడా బోర్డర్ వెంట పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. హసీనా ప్రభుత్వ హయాంలో అణిచివేసిన ఉగ్రవాదులు ఇప్పుడు మళ్లీ సరిహద్దు సమీపంలో శక్తిపుంజుకుంటున్నారని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. బోర్డర్ వెంట భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ సిక్దర్ మొహమ్మద్ అష్రపుర్ రెహమాన్, త్రిపురలోని డిప్యూటీ హైకమిషనర్ అరీఫుర్ రెహ్మాన్‌లను వెంటనే వెనక్కి వచ్చేయాలని బంగ్లాదేశ్ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు నిరసనగా త్రిపుర రాజధాని అగర్తలలో తమ కార్యాలయం వద్ద హిందూ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
9న బంగ్లాకు విదేశాంగ కార్యదర్శి
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమైంది. ఈనెల 9న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆ దేశ విదేశాంగ కార్యదర్శితో చర్చలు జరుపుతారు. ఆ పర్యటనలో మరింత మంది అధికారులతో కూడా భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మాక చర్చలు సాగుతాయనే ఆశాభావంతో ఉన్నట్లు విదేశీ వ్యవహారాల ప్రతినిధి జైశ్వాల్ చెప్పారు.