Share News

Bengaluru : జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:06 AM

తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విపిన్‌ గుప్త బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పారు.

Bengaluru : జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

  • భార్య హింస భరించలేకపోతున్నా

  • పోలీసులకు తేల్చిచెప్పిన బెంగళూరు టెకీ

బెంగళూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విపిన్‌ గుప్త బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పారు. భార్య పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నానని, వేధింపులు తట్టుకోలేనని వాపోయారు.

ఈ నెల మొదటి నుంచి ఆయన కనిపించకుండాపోవడంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఆయన ససేమిరా అంటున్నారు. యూపీలోని లఖ్‌నవూకు చెందిన విపిన్‌ గుప్త బెంగళూరు మాన్యతా టెక్‌పార్క్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నారు.

ఆయన భార్య శ్రీపర్ణ వయసు 42 సంవత్సరాలు. వీరికి ఇద్దరు సంతానం. బెంగళూరులోని కొడిగేహళ్లి టాటానగర్‌లో వీరు నివసిస్తున్నారు. ఇటీవల ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరిన విపిన్‌ గుప్తబ్యాంకులో రూ.1.80 లక్షలు డ్రా చేసి, ఎటో వెళ్లిపోయారు.

ఆయనకు సోలో రైడ్‌ అలవాటు ఉంది. గతంలో పలుమార్లు వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. అయితే, ఫోన్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఈసారి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండడం, వారం అయినా జాడలేకపోవడంతో భార్య ఈ నెల 6న కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం తన భర్త ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని, నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్‌’ లో పోస్ట్‌ చేయడంతోపాటు ప్రధానమంత్రికి ట్యాగ్‌ చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచి నోయిడాలో ఆయన ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి బుధవారం బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు విపిన్‌ నిరాకరించారు.

Updated Date - Aug 17 , 2024 | 04:06 AM