Share News

Goa: సీఈవో కేసులో సంచలన విషయాలు.. కుమారుడిని అలాగే చంపిందా?

ABN , Publish Date - Jan 10 , 2024 | 06:45 PM

గోవా (Goa)లో ఓ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితురాలిని పోలీసులు పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ముందు ప్లాన్ వేసుకునే బాలుడ్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

Goa: సీఈవో కేసులో సంచలన విషయాలు.. కుమారుడిని అలాగే చంపిందా?

పనాజీ: గోవా (Goa)లో ఓ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితురాలిని పోలీసులు పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ముందు ప్లాన్ వేసుకునే బాలుడ్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఇందుకు సంబధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన రూంలో పోలీసులు కీలక ఆధారాలు కనుగొన్నారు. హత్యకు ముందు చిన్నారికి దగ్గు సిరప్ ఓవర్ డోస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తరువాత అతన్ని దిండు లేదా దుస్తులతో ఊపిరాడనీకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

ఆమె అద్దెకు ఉన్న అపార్ట్‌మెంట్ గదిని తనిఖీ చేయగా.. రెండు ఖాళీ దగ్గు మందు సీసాలు కన్పించాయి. అందులో చిన్న సీసాను అక్కడి సిబ్బందే తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. పెద్ద సీసాను సుచనా తనతో పాటు తీసుకొచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘పక్కా స్కెచ్‌తోనే ఈ హత్య జరిగినట్లు కన్పిస్తోంది. గదిలో దగ్గు మందు సీసాలతో చిన్నారికి హైడోస్‌ ఇచ్చి ఉంటారని అనిపిస్తోంది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు తేలింది’’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే తాను ఈ హత్య చేయలేదనే.. ఉదయం లేచి చూసేసరికి బాబు చనిపోయి ఉన్నాడని ఆమె విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. భర్త తనను తరచూ హింసించేవాడని చెప్పింది.

మహిళ పేరు.. సుచనా సేథ్‌ (39). 2021 సంవత్సరానికిగాను ‘100 బ్రిలియంట్‌ ఉమెన్‌ ఇన్‌ ఏఐ ఎథిక్స్‌’లో ఒకరిగా నిలిచిన సుచనాసేథ్‌ ‘మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌’ అనే స్టార్టప్‌ స్థాపించి, దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సుచనా 2010లో కేరళకు చెందిన వెంకట్‌రామన్‌ను వివాహం చేసుకుంది. 2019లో వారికి ఒక అబ్బాయి పుట్టాడు. విభేదాలు రావడంతో ఆ దంపతులు 2020లో విడాకులకు దరఖాస్తు చేశారు.

ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటుండగా.. భర్త వెంకటరామన్‌ జకార్తా (ఇండోనేసియా)లో ఉంటున్నాడు. కాగా.. వారి విడాకుల కేసు విచారిస్తున్న కోర్టు.. ప్రతి శనివారం తన కుమారుణ్ని చూసుకుని, అతడితో గడిపే అవకాశాన్ని తండ్రికి కల్పించిందని, కానీ, భర్త మీద కోపంతో సుచనా ఆ తీర్పును ఎప్పుడూ గౌరవించలేదని సమాచారం.


ఈ క్రమంలోనే.. నాలుగు రోజుల క్రితం (జనవరి 6న) కొడుకుతో సహా గోవాకు వచ్చి అక్కడ ఒక సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో దిగింది. ఏడో తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో.. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూసే సిబ్బందికి ఫోన్‌ చేసి తనకు బెంగళూరుకు వెళ్లడానికి ట్యాక్సీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది. అంతదూరం ట్యాక్సీలో వెళ్లడానికి చాలా సమయం పడుతుందని.. పైగా, ట్యాక్సీ కన్నా విమానంలో వెళ్తేనే చవకని వారు చెప్పినా వినలేదు. దీంతో వారు ట్యాక్సీ బుక్‌ చేశారు. ముందురోజు తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి వచ్చిన ఆ మహిళ.. అర్ధరాత్రి సమయంలో కొడుకు తన వెంట లేకుండా, బరువైన బ్యాగుతో బయటకు వెళ్లడం చూసి ఆ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ సిబ్బందికి అనుమానం వచ్చింది. పైకెళ్లి ఆమె బస చేసిన ఫ్లాట్‌ను శుభ్రం చేస్తుండగా ఒక టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. తమ వద్ద రికార్డుల్లో ఉన్న ఆమె ఫోన్‌ నంబర్‌ కూడా పోలీసులకు ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి.. రక్తపు మరకల గురించి, ఆమె కుమారుడి గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె.. అవి తన నెలసరి తాలూకూ రక్తపు మరకలు అని, తన కుమారుడు దక్షిణగోవాలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడని వారికి తెలిపింది. స్నేహితురాలి చిరునామా అడగ్గా నోటికొచ్చిన అడ్రస్‌ చెప్పింది. పోలీసుల విచారణలో అది తప్పని తేలింది. దీంతో పోలీసులు.. సుచనా ప్రయాణిస్తున్న ట్యాక్సీ డ్రైవర్‌ వివరాలు తెలుసుకుని, అతడికి ఫోన్‌ చేశారు. దగ్గర్లో ఏ పోలీస్‌ స్టేషన్‌ ఉంటే అక్కడికి వెళ్లాలని.. ఆమెకు అర్థంకాకుండా ఉండేందుకు కొంకణి భాషలో ఆదేశించారు. అప్పటికే కారు కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చేరుకుంది. డ్రైవర్‌ తన కారును నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పోనిచ్చాడు. అక్కడ పోలీసులు ఆమె లగేజీని పరిశీలించగా.. లోపల కుక్కి ఉన్న బాలుడి మృతదేహం కనిపించింది. వెంటనే వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త ఫారెన్‌లో ఉండగా.. మంగళవారం రాత్రి ఆయన ఇండియా తిరిగి వచ్చాడు. బాబు మృతదేహాన్ని అధికారులు తండ్రికి ఇచ్చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 06:45 PM