Hathras Event: లైంగిక వేధింపుల కేసుల్లో ‘బోలే బాబా’..!
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:46 PM
ఉత్తరప్రదేశ్ హాథ్రాస్ తొక్కిసలాట ఘటన అనంతరం సురజ్ పాల్ అలియాస్ బోలే బాబా ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఆయన నిర్వహించిన సత్సంగాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
లఖ్‌నవూ, జులై 03: ఉత్తరప్రదేశ్ హాథ్రాస్ తొక్కిసలాట ఘటన అనంతరం సురజ్ పాల్ అలియాస్ బోలే బాబా ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఆయన నిర్వహించిన సత్సంగాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ క్రమంలో బాబా న్యాయపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. భక్తులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బోలే బాబాపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆగ్రా, ఎటా, కస్గంజ్, ఫరుఖ్కాబాద్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో బోలే బాబాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..
మరోవైపు కస్గంజ్ సమీపంలోని బహదూర్ నగర్‌లో సురజ్ పాల్ జన్మించారు. అనంతరం పోలీస్ శాఖలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు కావడంతో.. జైలు శిక్ష సైతం అనుభవించారు. ఆ తర్వాత నుంచి విడుదలైన పాల్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం సాకర్ విశ్వ హరిబాబాగా అవతారమెత్తాడు. తన పూర్వీకులు నివసించిన గ్రామంలోనే ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని... భక్తులను ఆకట్టుకోనేలా సత్సంగం పేరిట ప్రసంగాలను ప్రారంభించారు. దీంతో బాబాకు సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు.. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆయనకు భక్తులు విస్తరించారు.
Also Read: Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం
హాథ్రాస్ జిల్లాలో బోలే బాబా నిర్వహించిన సత్సంగం కారణంగా.. మంగళవారం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మరణించగా, 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో బోలే బాబా పేరు లేక పోవడం గమనార్హం. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. మరోవైపు.. ఈ తొక్కిసలాట ఘటన అనంతరం బోలే బాబా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారనే ఓ చర్చ సైతం జరుగుతుంది.
Read Latest National News and Telugu News